త్యాగనిరతికి ప్రతీక బక్రీద్
కడప కల్చరల్ :అద్భుతమైన ఈ సృష్టిని నియంత్రించే శక్తి ఒకటి ఉందని, ఆ శక్తినే అల్లాహ్ (దైవం) అని, ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసేందుకు వెనుకాడకూడదన్న సందేశాన్నిచ్చే పండుగ బక్రీద్. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతిని, సహనశీలత, రుజు వర్తనలను తెలుపుతుంది. మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం పక్షాన ప్రభవించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఐదు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన దేవుడే సకల చరాచర సృష్టికి కారకుడని, ఆయన పట్ల భక్తి ప్రకటించడం ద్వారా ముక్తిని పొందవచ్చునని జాతికి పిలుపునిచ్చారు. ఇస్లాంలో రంజాన్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, బక్రీద్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మంగళవారం ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు సిద్ధం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇస్తారు. మరో భాగాన్ని తమ కోసం వాడుకుంటారు.
త్యాగనిరతికి ప్రతీక:
ప్రవక్త ఇబ్రహీంకు దైవం మరొక కఠిన పరీక్ష పెట్టారు. కలలో అందిన సూచన మేరకు కుమారుడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు. కుమారుడు కూడా దైవాజ్ఞను శిరసావహించేందుకు అంగీకరిస్తాడు. తండ్రి ఇబ్రహీం కుమారుడిని ‘జుబాహ్’ చేశాడు. తీరా చూస్తే కుమారుడికి బదులు అక్కడ ఒక గొర్రెపోతు జుబాహ్ చేయబడి ఉంటుంది. దైవం పట్ల ప్రవక్త ఇబ్రహీంకు గల ఆచంచల భక్తి, విశ్వాసాలకు, త్యాగనిరతికి ప్రతీకగా ముస్లింలు యేటా ‘ ఈద్–ఉల్– జుహా ’ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఖుర్బానీ జంతువుల రక్త మాంసాలు అల్లాహ్‌కు చేరవు. కేవలం మీ భయభక్తులే చేరుతాయి – (దివ్య ఖురాన్‌లోని సందేశం)
నగరంలో..
బక్రీద్ పండుగ సందర్బంగా నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం కడప నగరంలో మసీదులు, ఈద్గాలలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర శివార్లలోని బిల్టప్, దండు ఈద్గాలు, చాంద్ ఫిరా గుంబద్‌తోపాటు దాదాపు అన్ని మసీదులు, ఈద్గాలలో ప్రార్థనల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.