– ఏవోబీ మల్కన్‌గిరిలో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో..
– మృతి చెందిన మావోల్లో ముగ్గురు జిల్లావాసులు
– మృతుల్లోని అగ్రనేతలకూ ఉద్దానంతో అనుబంధం
– ఒడిశాకు బయల్దేరి వెళ్లిన కుటుంబసభ్యులు
– జిల్లా అంతటా అప్రమత్తం, ముమ్మర తనిఖీలు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతమైన మల్కన్‌గిరి, రాయ్‌గడ జిల్లాల మధ్య ఆదివారం అర్ధరాత్రి తుపాకుల మోతతో దద్దరిల్లింది. తెల్లవారేసరికి ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 24 మందిలో ముగ్గురు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజినల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న అలియాస్ సురేష్, అతని భార్య రీజినల్ కమిటీ జననాట్యమండలి సభ్యురాలు బొడ్డు కుందనాలు అలియాస్ సునీత అలియాస్ మమత, సెంట్రల్ టెక్నికల్ కమిటీ సభ్యుడు మెట్టూరి జోగారావు అలియాస్ కోటీశ్వరరావు ఉద్దానం ప్రాంతం వారే. అంతేకాదు అదే ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో ఇద్దరు అగ్రనేతలు ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ సుధా అలియాస్ చలపతి, కృష్ణప్ప అలియాస్ దయాలకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలోనున్న సూరన్న, మమత, కోటీశ్వరరావు కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. మృతదేహాలను గుర్తించేందుకు వారు మల్కన్‌గిరికి బయల్దేరి వెళ్లారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఉద్యమాలకు దిక్సూచిగా పేరొందిన శ్రీకాకుళం సాయుధ పోరాటం తర్వాత పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీగా మారకముందు) కార్యకలాపాలు 1990 సంవత్సరం నుంచి మొదలయ్యాయి. ఆ కాలంలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ సుధా శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. అప్పటి వరకూ కాన్వెంట్ టీచర్‌గా పనిచేస్తున్న చెల్లూరు నారాయణ పీపుల్స్‌వార్‌లో చేరడానికి సుధా పిలుపే కారణం. సూరన్నగా పేరుమార్చుకున్న నారాయణ రాడికల్ యూత్‌లీగ్‌లో సభ్యునిగా చేరాడు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటంలో ఉద్దానం ప్రాంతం నుంచి కీలక పాత్ర పోషించిన రాజాం నివాసి గొరకల రాంబాబుకు సూరన్న బంధువు. తరువాత గంటి రాజన్న ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో సూరన్న డివిజన్ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నాడు. మిలటరీ క్యాంపుల్లో చురుకుగా పనిచేసేవాడు. మందస మండలం నల్లబొడ్డులూరు గ్రామానికి చెందిన బొడ్డు కుందనాలు అలియాస్ మమత అలియాస్ సునీత కూడా మావోయిస్టు పార్టీ దళం సభ్యురాలిగా చేరింది. ఆమెను సూరన్న వివాహం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో ఉద్దానం ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాతుపురానికే చెందిన మెట్టూరి భాస్కరరావు అలియాస్ కోటీశ్వరరావు కూడా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతం వారిని కదిలించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రీకాకుళం డివిజన్ కార్యదర్శి కృష్ణప్ప అలియాస్ దయా కూడా ఉద్దానం ప్రాంత వాసులకు పరిచయస్థుడే. సుధా తర్వాత ఈ ప్రాంత దళ కమాండర్‌గా పనిచేసిన కాలంలో భాస్కర్ పేరుతో ఆయన ఇక్కడ కార్యకలాపాలు సాగించేవాడు. జిల్లాలో పార్టీ బలహీనపడినప్పటికీ ఆయన మాత్రం పార్టీలో ఉన్నత స్థితికి ఎదుగుతూ ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు వెళ్లిపోయాడు.
కొన్నేళ్లుగా అజ్ఞాతంలోనే...
సూరన్న, ఆయన భార్య సునీత, కోటీశ్వరరావు పుష్కర కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. 2004 సంవత్సరం తర్వాత వారు జిల్లాకు దూరంగానే ఉన్నారు. వారు ముగ్గురూ ఒకేసారి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని తెలియడంతో ఉద్దానం ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అంతేకాదు వారు ముగ్గురూ బలహీనవర్గాలకు చెందినవారు. ఈ ప్రాంతంలో అనేక మందితో వారికి కుటుంబపరమైన సంబంధాలు ఉన్నాయి.
ఉద్యమాలకు పురిటిగడ్డ...
ఉద్యమాలకు పురిటిగడ్డగా జిల్లాకు పేరు. ఉద్దానం ప్రాంతంలో ఎంతోమంది ఉద్యమబాట పట్టారు. పీపుల్స్‌వార్‌లో చేరి తుపాకులు ఎత్తిపెట్టారు. అలాగే ఎన్‌కౌంటర్‌లు జిల్లావాసులకు కొత్త కాదు. జిల్లాలో 1969 సంవత్సరంలో జరిగిన గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో 360 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. అయినా ఇక్కడ పోరాటాలు ఆగలేదు. 1980 తరువాత పీపుల్స్‌వార్ పార్టీ ప్రజా సంఘాల పేరుతో రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్‌లను ఏర్పాటు చేసింది. వాటిలో జిల్లా నుంచి ఎక్కువ మంది సభ్యులుగా చేరారు. అందుకే దేశంలో ఎక్కడ మావోయిస్టులకు–పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినా సిక్కోలు ఉలిక్కిపడటానికి కారణం ఇదే. చాలా ఎన్‌కౌంటర్‌ల్లో ఒకరిద్దరైనా జిల్లావాసులు ఉంటున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోలు ఉద్దానం ప్రాంతంవారే కావడం గమనార్హం.
జిల్లా అంతటా అప్రమత్తం...
ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లాలో అలెర్ట్ ప్రకటించారు. రణస్థలం, బత్తిలి, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, వజ్రపుకొత్తూరు, పలాస ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మావోయిస్టులు ఏవోబీ దాటి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసినట్లు జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చెప్పారు.