'బాబు జ్ఞాపకశక్తి దెబ్బతింటోందా?'
దేవీచౌక్ (రాజమండ్రి) : 'గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యంవల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా? లేక మానసిక పరిస్థితిలో తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా?' అని చంద్రబాబునాయుడుని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకశక్తికి సంబంధించిన అల్జీమర్స్తో బాధపడ్డారని, సీనియర్ ఎంపీ జార్జి ఫెర్నాండెజ్ కూడా దీనిబారిన పడ్డారని, సీఎంకు కూడా అలాంటి వ్యాధి సోకిందన్న అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సీఎం చంద్రబాబు పుష్కరాల రేవులో స్నానం చేసి వెళ్లిన తర్వాత అధికారుల్లో రిలాక్స్ ధోరణి వచ్చిందన్నారు.
'తొక్కిసలాట జరిగి 45 రోజులవుతున్నా.. నిజాలు వెల్లడవుతాయనే విచారణకు ఆదేశించలేదని విమర్శించారు. 'గత కృష్ణా పుష్కరాల సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో ఒక బ్రిడ్జిపై రెయిలింగ్ విరిగిపోయి ఆరుగురు మరణించారు. హైదరాబాద్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి వెంటనే ఎస్పీ, కలెక్టర్లను బదిలీ చేసి, సంబంధిత ఇంజనీర్‌ను సస్పెండ్ చేసి న్యాయ విచారణకు ఆదేశించారు. నాడు వైఎస్ రాజీనామా చేయకపోతే, పుష్కరాలు జరగనివ్వబోమంటూ టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు’ అని ఉండవల్లి గుర్తు చేశారు. అనంతరం పుష్కరాల రేవులో సీఎం స్నానం చేసిన స్థలం, తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఉండవల్లి సందర్శించారు.