గుప్త నిధుల కోసం తవ్వకాలు
కారంపూడి (కార్యమపూడి)లోని పల్నాటి వీరుల గుడిలో గుప్త నిధుల కోసం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. క్రీ.శ.1182లో ప్రసిద్ధ పల్నాటి యుద్ధంలో వీరులు వాడిన ఆయుధాలున్న గుడిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పల్నాటి వీరుల గుడిలో ఘటన
కారంపూడి : కారంపూడి (కార్యమపూడి)లోని పల్నాటి వీరుల గుడిలో గుప్త నిధుల కోసం శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. క్రీ.శ.1182లో ప్రసిద్ధ పల్నాటి యుద్ధంలో వీరులు వాడిన ఆయుధాలున్న గుడిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయంత్రం ఏడు గంటలకు పూజారి పూజల పెదనరసింహ గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 9 గంటలకు గుడికి వచ్చిన ఆయనకు గేటు తాళాలు పగుల గొట్టి కనిపించాయి. గర్భగుడిలో బండలు తొలగించి గుంత తవ్వి, మళ్లీ మట్టిపూడ్చి బండలు పెట్టినట్లుగా సంఘటన స్థలం ఉంది. ఈ ఘటనపై పీఠాధిపతి పడిగు తరుణ్ చెన్నకేశవ పూజారులు ఏఎస్సై ఫైయింబర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన గ్యాంగ్ ఈ సంఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసు, ఇంటెలిజñ న్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
శివాలయంలోనూ తవ్వకాలు..
చింతపల్లి గ్రామ పొలాల్లో ఉన్న పల్నాటి చరిత్ర కాలం నాటి శివాలయంలో కూడా గురువారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో శివాలయం పరిసరాల్లో బంగారు నాణేలు దొరికాయని స్థానికులు చెబుతారు. ఈ సంఘటనల నేపథ్యంలో పథకం ప్రకారం గుప్తనిధుల త్వకాల బ్యాచ్ ఈ సంఘటనలకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘటన స్థలానికి చేరుకున్న ప్రకాశం జిల్లా ఆచారవంతుడు నరేంద్ర తదితరులు డిమాండ్ చేశారు.
రక్షిత కట్టడానికి రక్షణ ఇదేనా?
పురావస్తు శాఖ 2011లో వీరుల గుడిని రక్షిత కట్టడంగా గుర్తించి రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. వీరుల గుడి నిర్వహణ పీఠాధిపతి ఆధ్వర్యంలోని పూజారులైన ఎర్రగొల్లల ఆధ్వర్యంలో ఉంది. బ్రహ్మనాయుడు చాపకూడు భవనం తదితరాలు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన వాచ్‌మెన్‌ల పర్యవేక్షణలో ఉన్నాయి. వాచ్‌మెన్‌లు సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతారు. దీంతో రాత్రి వేళల్లో రక్షణ కరువై ఈ సంఘటనకు కారణమైంది. గతంలోనూ వీరుల ఆయుధాలను కొనడం.. అమ్మడం లాంటి రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే గుప్తనిధుల కోసం అన్వేషణ జరగడం ఇదే ప్రథమం. ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఆదేశాలతో ఆ శాఖ ఏడీఏ బి.దీపక్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుప్త నిధులుంటాయనే ఊహతో జరిగిన విద్రోహ చర్యని, గుప్త నిధులున్నాయా? లేదా? అని చెప్పడం సాధ్యం కాదని దీపక్ తెలిపారు. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటి వరకు గుడి అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, రక్షణ లోపంపై డైరెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు.