సర్దుబాటుతనమే దాంపత్య జీవనసూత్రం
భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు
వివాహ వ్యవస్థపై ‘ప్రభాకరవాణి’ చర్చావేదిక
రాజమహేంద్రవరం కల్చరల్ :
వివాహ జీవితం ఆనందమయం కావాలంటే.. వధూవరులమధ్య ‘సర్దుబాటుతనం’ చాలా అవసరమని భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు అన్నారు. ప్రభాకరవాణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విక్రమ హాల్లో ‘ఆధునిక వివాహ వ్యవస్థ’ అనే అంశంపై జరిగిన చర్చావేదికలో నారాయణరావు మాట్లాడుతూ సర్దుబాటు తనం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుం దన్నారు. ఆధునిక వివాహ వ్యవస్థ అనాలో, వివాహ అవస్థ అనాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ సమయంలో ఉమా మహేశ్వరులను, వాణీహిరణ్య గర్భులను, సీతారాములను, అరుంధతీ వశిష్ఠులను సంస్మరించేది భారతీయవైవాహిక వ్యవస్థ ఒక్కటేనన్నారు. పెళ్ళిళ్ళు పెటాకులు కావడానికి కారణాలను విశ్లేషిస్తూ నిశ్చితార్థం జరిగాక వివాహానికి ఎక్కువ వ్యవధి ఉండటం మంచిది కాదన్నారు. నిశ్చితార్థం అయిన అనంతరం వీడియో ఛాటింగ్‌లో అబ్బాయి అమ్మాయితో ‘పెళ్ళిచూపుల నాడు కన్నా నీవు కొంచెం లావెక్కినట్టు ఉన్నావే’నని యాథాలాపంగా అన్న మాటతో అమ్మాయి వివాహం రద్దు చేసుకున్న వైనాన్ని వివరించారు. యుక్త వయసులో వివాహాలు జరగడం మంచిదని, మా అబ్బాయికి 34 ఏళ్ళే, అమ్మాయికి 34 ఏళ్ళే అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు లాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని కూర్చుంటే పురుషుడిలో కొంత శక్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. యువతరానికి మన సాహిత్యసంపదను అందించాలని, సనాతనధర్మం వివాహ వ్యవస్థకు ఇచ్చిన ప్రాముఖ్యతను గుర్తించే లా చేయాలని సూచించారు.
వివాహం.. రెండు కుటుంబాల బంధం
ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ వివాహమనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాక రెండు కుటుంబాల మధ్య బంధమని గుర్తించాలన్నారు. వివాహాలు విఫలమయ్యాయంటే ఆ రెండు కుటుంబాలే కారణమన్నారు. మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘వెనుకటి తరంలో అమ్మాయిని ఎటువంటి వరుడు కావాలని అడిగితే మా నాన్నని అడగమని చెప్పేది. ఈతరంలో కన్యాదాతను మీ అమ్మాయికి ఎటువంటి వరుడు కావాలని అడిగితే–అమ్మాయిని అడిగి చెబుతానంటున్నాడు. మార్పు ఎక్కడ వచ్చిందో కనుక్కోవాలి’ అన్నారు. ఆర్థికస్వేచ్ఛ మితిమీరితే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకుడు ఉప్పలపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ఒక జ్యోతిషవేత్తగా నిత్యం తనవద్దకు వివాహితులు వచ్చి సమస్యలను ఏకరువు పెడుతుంటారని, వీటిలో చాలా భాగం సృష్టించుకున్న సమస్యలేనని అన్నారు. మహా మహోపాధ్యాయ దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలాధారమయినది వివాహ వ్యవస్థేనన్నారు. వాడ్రేవు వేణుగోపాలరావు, అజ్జరపు హరిబాబు, టి.కె.విశేశ్వరరెడ్డి, ధూళిపాళ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.