
'నిరుద్యోగులకు తెలంగాణలోనూ అన్యాయమే'
కూసుమంచి(ఖమ్మం జిల్లా):
ఆంధ్రా పాలనలో విద్యావంతులు ఉద్యోగాల్లేక నిరుద్యోగులుగా మిగిలారని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పినట్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం సభకు వెళ్లారనే విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా..ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేయడమే తన అభిమతమని అన్నారు.
ఇందుకోసం పోరాడే పార్టీల వద్దకు ఒక్కోసారి వెళ్లాల్సివస్తోందని కోదండరాం బదులిచ్చారు. తనకూ సంస్కారం, వివేకం ఉందని, ఎవరో చెబితే వినాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని కొందరు తాము లక్ష ఉద్యోగాలు ఇస్తాం కానీ అవకాశం ఉన్నప్పుడు అని ప్రకటించటం పద్ధతికాదని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంపై సీఎంను కలిశారా అంటూ కోదండరాంను విలేకరులు ప్రశ్నించగా..సీఎంను కలవడమంటే దేవుడికి ఉత్తరం రాసినట్లేనని చమత్కరించారు.