విధి వంచితులు
Published Thu, Aug 11 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
సాఫీగా సాగిపోయే చిన్న కుటుంబమది. ఉన్నంతలో గుట్టుగా ఇల్లు గడుపుకొంటూ, ఇలా జీవితం నడిస్తే చాలనుకునే సంసారమది. గాలివాటంలో అలల బాటలో అలనల్లన సాగిపోయే తెరచాప నావ వంటి ఆ కుటుంబంపై విధి పగబట్టింది. సమస్యల అలజడి సష్టించి ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసింది. అనారోగ్యం రూపంలో వారిపై పగబట్టింది. పని చేయాల్సిన భర్త, చదువుకోవాల్సిన కొడుకులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ విలవిల్లాడుతుంటే, గహలక్ష్మి అయిన ఇల్లాలు కూలి పనులు చేసి వారిని సాకాల్సిన దురవస్థ ఏర్పడింది.
తగరపువలస: కష్టం ఎవరికైనా కష్టమే కానీ, కష్టపడితేనే కడుపు నిండే ఆ చిరు కుటుంబానికి మాత్రం అది అలవిమాలిన కష్టమయింది. అనారోగ్యం పంజా విసరడంతో ఆ కుటుంబం సుడిగాలిలో చిగురుటాకులా విలవిల్లాడుతోంది. విధి వ్యాధి రూపంలో విరుచుకుపడి తండ్రీ కొడుకులను మంచాన పడేసింది. చెమటోడ్చి సంపాదించాల్సిన భర్త, చదువుకు వెళ్లాల్సిన కుమారులను సాకడానికి కూలి పని చేస్తూ, వారిని ఆస్పత్రులకు తిప్పుతూ ఆ ఇల్లాలు అష్టకష్టాలు పడుతోంది.
ఇదీ పరిస్థితి
భీమిలి మండలం మజ్జివలసకు చెందిన గువ్వల బంగారుబాబు, ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో అప్పలరాజు ఇంటర్మీడియట్ చదువుతుండగా, రెండోవాడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల కిందట మూలవ్యాధి సోకడంతో బంగారుబాబు నాటువైద్యులను ఆశ్రయించాడు. క్వారీలారీలో క్లీనర్‌గా విధులు నిర్వర్తించే బంగారుబాబుకు మూలవ్యాధి నయంకాకపోగా కండరాలు పట్టేశాయి. దీంతో ఇంటికే పరిమితమైపోయాడు. రెండోకుమారుడు నాగరాజు అంతుచిక్కని వ్యాధితో పుట్టడంతో నగరంలోని ఆసుపత్రులన్నీ చుట్టేశారు. ఉన్నకాడికి అమ్మివైద్యం చేయించినా వ్యాధి నిర్ధారణ కాలేదు. కేన్సరో, టాన్సిల్సో అర్ధం కావట్లేదు. క్షయ కూడా ఉందంటూ వైద్యులు ఆ పరీక్షలు కూడా చేసి మందులు ఇస్తున్నారు.
గోరుచుట్టుపై రోకటిపోటులా..
పెద్ద కుమారుడు అప్పలరాజు మజ్జివలస జెడ్పీహైస్కూల్‌లోనే పదోతరగతి పూర్తిచేసి ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో చేరాడు. ఈ నెల మొదటి వారంలో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యాడు. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే కిడ్నీలు పాడయ్యాయన్నారు. రెండువారాల పాటు కేజీహెచ్‌లో ఉంచి డయాలసిస్ చేయించి మందులిచ్చి ఇటీవల డిశ్చార్జ్ చేశారు. గ్రామస్తులు, స్నేహితులు రూ.12వేలు పోగేసి సాయం చేశారు. ప్రస్తుతం డబ్బులేదు.
Advertisement