బాలాజీచెరువు (కాకినాడ) :
ఉపాధ్యాయుల హక్కుల సాధనకు యూటీఎఫ్ కృషిచేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వేంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక యూటీఎఫ్‌హోంలో గురువారం విద్యాసదస్సు జరిగింది. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికా వంటి దేశాల్లో 12వ తరగతి వరకూ ఉచిత విద్యను కల్పిస్తుంటే ఇక్కడ మాత్రం విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత దిశగా ప్రభుత్వం ఉన్నందున ప్రజలే ఉద్యమించాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్‌సీ రామూ సూర్యారావు మాట్లాడుతూ గ్రామాల్లో లక్షల కొలది గుడులకు నిధులిస్తున్నారని, వాటిని బడులకు ఇచ్చి విద్యారంగాన్ని కాపాడాలన్నారు. అనంతరం పదవ తరగతిలో పదికి పది పాయింట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి 112 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వి.రాఘవులు, కార్యదర్శి టి.వి.కామేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.