కనువిందుగా ఉట్ల పరుష
రొద్దం : మండల కేంద్రంలోని పెన్నానది ఒడ్డున వెలసిన గ్రామదేవత రొద్దకాంబదేవి 10వ జాతరోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఉట్లపరుష కనువిందుగా సాగింది. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, రుద్రపాద శివునికి అలంకార పూజలు, ఆకుపూజ అలంకరణ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి తరలివచ్చిన అశేష జన సందోహం నడుమ ఉట్లపరుషను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.
చివరకు రొద్దం కంపల్లి గ్రామానికి చెందిన అంగజాల వంశీయుడు అంగజాల నరసప్ప కుమారుడు రాజేంద్ర అనే యువకుడు ఉట్లమాను ఎక్కాడు. ఆయనను డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా వచ్చారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ మున్నీర్‌అహ్మద్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.