ఖనిజసంపదను దోచుకునేందుకే గ్రీన్‌హంట్
పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, సాధినేని
సాక్షి, కొత్తగూడెం: అడవితల్లిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీలకు కల్లా కపటం తెలియదని, కానీ వారి హక్కులను కాలరాయాలని చూస్తే, ఆ హక్కులను కాపాడుకోవడానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడతారని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సంత గ్రౌండ్‌లో గురువారం జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పోడు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం గిరిజనులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
అడవుల నుంచి వారిని బయటకు పంపించి, ఖనిజసంపదను దోచుకునేందుకే గ్రీన్‌హంట్ పేరుతో దాడులకు దిగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని లక్షల ఎకరాల భూములను బడాబాబులకు, కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసీలను అటవీ భూముల్లో నుంచి తరిమివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు, గిరిజనులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారని, వారి సమస్యలు పట్టవు కానీ, వారి భూములు మాత్రం కావాలా అని ప్రభుత్వాలను ప్రశ్నించారు.
ఖనిజసంపదను దోచుకెళ్లడానికి ఆదివాసీలు అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో, వారికి అండగా నిలబడుతున్న నాయకులను ఎన్‌కౌంటర్ పేరుతో చంపుతున్నారని అన్నారు. కొత్తగూడెంలోని పునుకుడు చెలకలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసి విమానాల ద్వారా అక్కడి ఖనిజ సంపదను దోచుకెళ్లాడానికి, బహుళజాతి కంపెనీలను తీసుకరావడానికి జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంటకటేశ్వరరావు మాట్లాడుతూ అడవులను నాశనం చేసేది గిరిజనులు కాదని, ప్రభుత్వాలేనని అన్నారు. పోడు చేసుకుంటున్న గిరిజనులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తొలుత అరుణోదయ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటలతో అందరినీ అలరించారు. సభలో ఎన్‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్తార్‌పాషా, ఇప్టూ జిల్లా కార్యదర్శి ఎల్.విశ్వనాధం, జిల్లా నాయకులు సత్యం, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు కోలేటి నాగేశ్వరరావు, ఇప్టూ జాతీయ కమిటీ సభ్యులు రాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.