గ్రీన్హంట్ను నిలిపివేయాలి: వరవరరావు
హైదరాబాద్: ఆదివాసీలను మట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 3వ దశ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేయాలని విరసం నేత వరవరరావు అన్నారు. ఆదివాసీ, దళిత, మహిళ, మైనార్టీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, పోలీస్, పారామిలటరీ జరుపుతున్న హత్యాకాండలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన వరంగల్ పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఎదురుగా ఇస్లామియా కాలేజీ వరకు ర్యాలీ, అనంతరం బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సభ పోస్టర్‌ను స్వాతంత్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్తా, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరితో కలసి గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ దోపిడీకి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారని వారికి పాలకులు అండగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆదివాసీ సమాజాన్ని మ్యూజియం వస్తువుగా మార్చారని భారతదేశంలో కూడా చేసేందుకు యత్నిస్తున్నా వామపక్షాలు వారికి పూర్తిగా అండగా ఉండడంవల్ల సాధ్యం కావడంలేదని అన్నారు.