బ్రహ్మోత్సవ వేడుకకు వేళాయె...
వాడపల్లి (ఆత్రేయపురం) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సిద్ధం చేసిన స్వామి వారి ఆహ్వాన పత్రిక, పోస్టర్లను ఆదివారం స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు భక్తులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి మాట్లాడుతూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్న వేంకటేశ్వరస్వామి కొలువైన వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు.
వాడపల్లి ముస్తాబు..
ఐదురోజుల పాటు జరిగే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వాడపల్లి ముస్తాబవుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అష్టదళ పాదపద్మారాధన, ఐశ్వర్యలక్ష్మి హోమం, సహస్ర దీపాలంకరణసేవ, అషో్టత్తర కలశాభిషేకం తదితర అర్జిత సేవలు నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే అషో్టత్తర పూజలు, కల్యాణాలు, ఉప నయనాలు, వివాహలు రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సోవ ఆర్జిత సేవలకు రూ.1116 చెల్లించే భక్తులు నగదు, డీడీలు, మనియార్డర్లు ఈఓ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, వాడపల్లి, ఆత్రేయపురం మండలం, ఫోన్: 08855–271888కు పంపి, రసీదు పొందాలన్నారు.