కన్నుల పండువగా పుష్పోత్సవాలు
వాడపల్లి, ర్యాలిలో ముగిసిన కల్యాణోత్సవాలు
వాడపల్లి(ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి వార్ల పుష్పోత్సవాలు బుధవారం కన్నులపండువగా నిర్వహించారు. వీటితో ఈ రెండు ఆలయాల్లో జరుగుతున్న కల్యాణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కల్యాణోత్సవాల ముగింపు సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం గోవిందనామస్మరణతో మార్మోగింది. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, బాలభోగం, నివేదన, తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. వాడపల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి భక్తులు గోవింద నామస్మరణతో గ్రామోత్సవం చేశారు. వైఖానస పండితులు శ్రీమాన్ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు పుష్పోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. 11 రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి 121 రకాల మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పూలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోలపాటలతో శయనింపజేశారు. వందలాది దంపతులకు దంపతి తాంబులాలు అందించారు. తీర్థ మహోత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణ మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉదయం స్వామివారికి వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో మేలుకొలుపు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శ్రీ పుష్పోత్సవాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.