వాడపల్లికి పెళ్లికళ
-
నేటి నుంచి వెంకన్న కల్యాణోత్సవాలు
-
రేపు రథోత్సవం, పరిణయపర్వం
ఆత్రేయపురం (కొత్తపేట) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి పెళ్లికళను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవో బీహెచ్‌వీ రమణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎండ వేడి తగలకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేసి, ఫ్యాన్లు అమర్చారు. స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బంది పడకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లొల్ల నుంచి వాడపల్లి వరకు అనేక స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వాడపల్లికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. స్వామివారి ప్రసాదం కొరత రాకుండా సుమారు 50 వేల లడ్డులు తయారుచేసి సిద్దంగా ఉంచారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మ¯ŒS, ఈవో తెలిపారు. కాగా బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్ర పుష్పం, కల్యాణం, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
ఇదీ కల్యాణోత్సవాల క్రమం
గురువారం ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణతో కల్యాణోత్సవాలు మొదలవుతాయి. 7న రథోత్సవం, రాత్రి స్వామి వారి కల్యాణమహోత్సవం జరుగుతాయి. ప్రభుత్వం తరఫున శాసనమండలి డిప్యూటీ చైర్మ¯ŒS రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్‌డీవో జి.గణేష్‌కుమార్ స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి అచారం ప్రకారం వంశ పారంపర్యంగా హైదరాబాదుకు చెందిన జఠవల్లభుల గోపాలకృష్ణ సోమయాజులు దంపతులు ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణఘట్టాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. రావులపాలెంకు చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. గౌతమి గోదావరిలో రాత్రి 10 గంటలకు తెప్పోత్సవం విద్యుత్ వెలుగుల మధ్య జరుగుతుంది. 8న పొన్నవాహన మహోత్సవం, 9న సదస్యం, 10న ప్రత్యేక పూజలు, 11న గౌతమి గోదావరిలో స్వామి వారి చక్రతీర్థస్నానం జరుగుతాయి. 12న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.