నయన మనోహరం వెంకన్న కల్యాణం
వాడపల్లి(ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కోనేటి రాయుడు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి గంటలకు రమణీయంగా జరిగాయి. సుందరంగా అలంకరించిన కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆర్‌డీఓ జి.గణేష్‌కుమార్ కుమార్ దంపతులు, డీఎల్‌పీవో జేవీవీఎస్ శర్మ దంపతులు, ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు , ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ఎంపీపీలు వాకలపూడి వెంకట కృష్ణారావు, కోట చెల్లయ్య, రెడ్డి అనంతకుమారి, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి, ఈఓపీఆర్‌డీ డీవై నారాయణలు స్వామి వారికి ప్రభుత్వం తరఫున∙పట్టు వస్త్రాలను సమర్పించారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం చైత్ర శుద్ధ ఏకాదశి శుభముçహూర్తం రాత్రి ఏడు గంటలకు కల్యాణోత్సవాలను వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహలను పట్టు వస్త్రాలు, బంగారు, వెండి, వజ్రాభరణాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేదికకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. వ్యాఖ్యాతగా ఎన్‌వీ సోమయాజులు, అయ్యంగారి పట్టాబిరామయ్య వ్యవహరించారు. మ«ధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి ర«థోత్సవం పురమాడ వీధుల్లో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం గౌతమి గోదావరి లో ఏర్పాటు చేసిన హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం రాత్రి 10 గంటలకు కన్నుల పండువగా జరిగింది. రావులపాలేనికి చెందిన వ్యాపారి మన్యం సుబ్రహ్మణ్యేశ్వరారావు దంపతులు ముత్యాల తలంబ్రాలను సమకూర్చగా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరిగింది. కల్యాణ వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమీటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యలో ఆలయ కమీటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.