వెంకన్న ఆలయ పనులకు ఈ-టెండర్లు ఖరారు
వెంకన్న ఆలయ పనులకు ఈ-టెండర్లు ఖరారు
Published Tue, Feb 28 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.32.20 లక్షలతో చేపట్టనున్న ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వినైజ్‌డ్ మెస్ అభివృద్ధి పనులకు ఈ-టెండర్లు ఖారారైనట్లు ఈఓ బీహెచ్‌ఈ రమణమూర్తి మంగళవారం తెలిపారు. సుమారు 15 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారన్నారు. అన్నదాన సత్రానికి, ప్రహరీకి రూ.10 లక్షలు కేటాయించగా 15.75 శాతం తక్కువకు, పీఈబీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకాగా 15 శాతం తక్కువకు, ఫ్లోరింగ్ రూ.4.70 లక్షలు కేటాయించగా 10.01 శాతం తక్కువకు, గాల్వినైజెడ్ మెస్ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు కేటాయించగా 14.1 శాతం తక్కువకు టెండర్లు ఖారారు చేశారు. ఫిబ్రవరి 16న అధికారులు బాక్సు టెండర్లు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రూ.10 లక్షలకు మించిన పనులకు ఈ-టెండర్లు పిలవాల్సి ఉండగా బాక్సు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కేవలం రూ.32ల తక్కువకు టెండర్లను అధికార్లు ఖరారు చేసినట్లు ఆలయ ఈఓ రమణ మూర్తి తెలిపారు. దీనిపై ‘అవకతవకలపై టెండరింగ్’ అంటూ ఫిబ్రవరం 17న సాక్షిలో కథనం రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖారారైన బాక్సు టెండర్లను రద్దు చేశారు. తిరిగి ఈ-టెండర్లు ఆహ్వానించడంతో సుమారు రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. అయితే గతంలో రూ.32.20 లక్షల పనులను బాక్సు టెండర్లలో రూ.32కే దక్కించుకున్న కాంట్రాక్టర్ మరికొందరితోపాటు ఈ-టెండర్‌లో రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కోడ్ చేయడంతో తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. బాక్సు టెండర్ల ద్వారా పచ్చ చొక్కా కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చుదామని తీవ్రంగా ప్రయత్నించిన ఆలయ అధికారులకు, ఆ పార్టీ నియోజకవర్గ నేతలకు చివరకు ఆశా భంగమే కలిగింది.
Advertisement