
పార్టీని రెపరెపలాడిస్తాం
► దమ్ముంటే అడ్డుకోండి
► ఎన్ని అడ్డంకులు సృష్టించినా అదరం కేసులకు బెదరం
► టీడీపీ నేతలకు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రాధాకృష్ణ సవాల్
విజయవాడ : ‘విజయవాడ నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం.. నీచ రాజకీయాలకు అలవాటు పడిన తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టించినా, కేసులు పెట్టినా భయపడం.. దమ్ము, ధైర్యం ఉంటే అడ్డుకోవటానికి ప్రయత్నించండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నేతలకు సవాలు విసిరారు.
మంగళవారం విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ సమావేశం జరుగుతుండటంతో తమ అభిమానులు దివంగత వైఎస్సార్, దివంగత వంగవీటి రంగా చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని చూసి జీర్ణించుకోలేని సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గూశరం లేకుండా తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు.
ప్రజల కోసం పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని, ప్రజలందరూ వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు తనకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని సాక్షి టీవీ ప్రసారాలు ఆపివేయించారని, కానీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆపగలరా అని ప్రశ్నించారు. మహా అయితే కేసులు పెడతారు అంతే కదా.. అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.