Radhakrishna Vangaveeti
-
పార్టీని రెపరెపలాడిస్తాం
► దమ్ముంటే అడ్డుకోండి ► ఎన్ని అడ్డంకులు సృష్టించినా అదరం కేసులకు బెదరం ► టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాధాకృష్ణ సవాల్ విజయవాడ : ‘విజయవాడ నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం.. నీచ రాజకీయాలకు అలవాటు పడిన తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టించినా, కేసులు పెట్టినా భయపడం.. దమ్ము, ధైర్యం ఉంటే అడ్డుకోవటానికి ప్రయత్నించండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీ నేతలకు సవాలు విసిరారు. మంగళవారం విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ సమావేశం జరుగుతుండటంతో తమ అభిమానులు దివంగత వైఎస్సార్, దివంగత వంగవీటి రంగా చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని చూసి జీర్ణించుకోలేని సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గూశరం లేకుండా తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని, ప్రజలందరూ వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు తనకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని సాక్షి టీవీ ప్రసారాలు ఆపివేయించారని, కానీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆపగలరా అని ప్రశ్నించారు. మహా అయితే కేసులు పెడతారు అంతే కదా.. అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
హామీలపై చర్చకు సిద్ధమా..?
విజయవాడ (గాంధీనగర్) : ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయకుండా, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బా కొడుతున్నారని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. ఏ హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చారో చెప్పాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్మూ ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఈ రెండేళ్లలో మీరేం చేశారు? మీ సొంతానికి ఎంత ఖర్చుచేశారు? ప్రజల కోసం ఎంత ఖర్చు చేశారు? కేంద్రం ఎంత ఇచ్చిందో స్పష్టంచేయాలి’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరుతూ గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. తొలుత వైఎ స్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ నాయకులు న్యూ ఇండియా హోటల్, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్ మీదుగా గవర్నర్‌పేట పీఎస్ వరకూ పాదయాత్ర చేశారు. రుణాలు వట్టిమాటే.. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసగించి అధికారం చేజిక్కించుకున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మోసంచేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కాలేదని, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఆపై మాటతప్పి కాపులపై కేసులు పెట్టి వేధిం పులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల రిజిస్ట్రేన్లు పునరుద్ధరించాలని ధర్నా చేస్తే అరెస్టు చేయించిన సీఎం చంద్రబాబు తాను మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నవనిర్మాణ దీక్ష పేరుతో బెంజిసర్కిల్ వద్ద బందరు రోడ్డుపై సభ నిర్వహించి, ప్రజలకు ఇబ్బంది కలిగించారని విమర్శించారు. రాష్ట్రంలో 2050 వరకు చంద్రబాబు పాలన ఉంటే ప్రజలంతా వలస వెళ్లాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన హామీలతో కూడిన ఫిర్యాదును సీఐకు అందజేశారు. మహిళలు తలెత్తుకోలేకపోతున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో గౌరవంగా బతికిన మహిళలకు నేడు తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పైలా సోమినాయుడు, కామా దేవరాజ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, చందన సురేష్, దాసరి నాగమల్లేశ్వరి, బహుదూర్, షేక్ అసిఫ్, బుల్లా విజయ్‌కుమార్, శివశంకర్, దామోదర్, పూర్ణిమ, వీరమాచనేని లలిత, సంధ్యారాణి, బీజాన్బీ, చోడిశెట్టి సుజాత, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, ట్రేడ్‌యూనియన్ నాయకులు విశ్వనాథ రవి, బోను రాజేష్, అమ్ముల రవికుమార్, విద్యార్థి నాయకుడు అంజిరెడ్డి పాల్గొన్నారు. -
మాది ప్రజాపక్షం
పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించే వరకూ పోరాటం హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా విజయవాడ (గాంధీనగర్) : పేదల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించే వరకూ ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాలను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తామని వాగ్దానం చేశారని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దుర్మార్గమని విమర్శించారు. పాయకాపురం, సింగ్‌నగర్ ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని కోరుతూ ప్రకాష్‌నగర్ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ధర్నాలో వంగవీటి రాధా ప్రసంగించారు. పాయకాపురం, సింగ్‌నగర్ ప్రాంతాల పేదలు రోజువారీ కూలిపనులు చేసుకుని జీవిస్తారని, పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే డబ్బు కోసం ఇళ్ల పట్టాలు తాకట్టుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. స్వరాజ్య మైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టినట్లే ఈ ప్రాంతాన్ని కూడా విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించకుంటే ప్రజలతో రోడ్డుపై బైఠాయిస్తామని హెచ్చరించారు. మార్కుల కోసమే జగన్‌పై విమర్శలు సీఎం చంద్రబాబు వద్ద మార్కులు పొందేం దుకే తమ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రులు విమర్శలు చేస్తున్నారని వంగవీటి రాధా ఎద్దేవాచేశారు. రోడ్లపై సమావేశాలు నిర్వహించవద్దని సుప్రీం కోర్టు ఆదేశించినా, నిత్యం వేల వాహనాలు, లక్షల మంది ప్రజలు రాకపోకలు సాగించే బెంజిసర్కిల్ వద్ద జాతీయ రహదారిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా సుప్రీం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. తాము రోడ్డు పక్కన ధర్నా చేస్తుంటేనే ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం జాతీయ రహదారులను బ్లాక్ చేసి దీక్షలు చేయడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేశారని నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైలా సోమినాయుడు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు బహదూర్, భవకుమార్, పల్లం రవికుమార్, అవుతు శ్రీశైలజ, సోడిశెట్టి సుజాత, బీజాన్బీ, పాల ఝాన్సీరాణి, శివశంకర్, జమాల పూర్ణిమ పార్టీ డివిజన్ అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ, పలువురు నాయకులను పోలీసులు అరెస్టుచేసి ఇతర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు తరలించారు. తోట్లవల్లూరు పీఎస్‌కు తరలింపు విజయవాడ ప్రకాష్‌నగర్‌లో ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ నాయకులు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, ఉమ్మడిశెట్టి బహదూర్, ఎస్కె.గౌస్‌మొహిద్దీన్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్ తోపాటు పలువురు మహిళలను స్కూల్ బస్సులో తోట్లవల్లూరు సీఎస్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటలకు వారిని విడిచి పెట్టారు. -
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణం వైఎస్సార్ సీపీ నేతలు వంగవీటి రాధ, లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నేడు విజయవాడలో దీక్ష విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రాధా కార్యాలయంలో పార్టీ కార్పొరేటర్లతో వారు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల ప్రజల ప్రయోజనాలను తన చర్యలతో తాకట్టుపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా సీఎం నోరు మెదపడంలేదని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏ ప్రభుత్వమైనా కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలంటే ఆయా నదీ బోర్డుల అనుమతి తప్పనిసరి అని వివరించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడాన్ని సాకుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తానూ అనుమతులు లేకుండానే కృష్ణా, గోదావరి నదులపై అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని విమర్శించారు. వాటిని అడ్డుకోవాల్సిన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకే జగన్మోహన్రెడ్డి తెలంగాణ సర్కారుపై పోరుకు దిగారని చెప్పారు. కర్నూలు జిల్లాలో చేపట్టిన జలదీక్షకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు జగన్మోహన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. జగన్‌కు మద్దతుగా నేడు నగరంలో దీక్ష కర్నూలులో జగన్మోహన్రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని అలంకార్ థియేటర్ వద్ద దీక్ష చేపడుతున్నామని వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. రైతులు, ప్రజలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా అంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ దీక్షకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు చేపట్టాలని సూచించారు. అనంతరం ధర్నా ఏర్పాట్లను పార్టీ కార్పొరేటర్లతో సమీక్షించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, చందన సురేష్, పళ్లెం రవి, కె.దామోదర్, కరీమున్నీసా, వీరమాచినేని లలిత, ఉమ్మడిశెట్టి బహుదూర్, పాలా ఝాన్సీలక్ష్మి, మల్లేశ్వరి, ఐతు శైలజ, చోడిశెట్టి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పసికందుకు కన్నీటి వీడ్కోలు
కృష్ణలంక : ఎలుకలు దాడిలో మృతిచెందిన పసికందు మృతదేహాన్ని గురువారం నగరానికి తీసుకువచ్చారు. గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి బలైన ఆ శిశువుకు కడసారి వీడ్కోలు చెప్పేందుకు నగరవాసులు భారీగా కృష్ణలంకలోని ఆనందభవన్రోడ్డుకు చేరుకున్నారు. వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ శిశువు మృతదేహాన్ని సందర్శించి ఆ మాతృమూర్తి లక్ష్మిని ఓదార్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి గురువారం మధ్యాహ్నం విజయవాడకు తీసుకువచ్చారు. సాయంత్రం పసికందుకు భవానీపురం శ్మశానవాటికలో ఖననం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ, కార్పొరేటర్లు చందన సురేష్, గొరిపర్తి నరసింహారావు, చెన్నుపాటి గాంధీ, అడపా శేషు తదితరులు పసికందు తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నిర్లక్ష్య వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసికందు మృతి విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన గుంటూరు వెళ్లి సంఘటనపై డాక్టర్లతో మాట్లాడారు. సంఘటనకు కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చరిత్రలో లేని ఘోర సంఘటన అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్ధసారథి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసిన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మరవలేని దారుణం జరగడం శోచనీయమన్నారు. బాలుడు మృతికి ప్రధాన బాద్యత ప్రభుత్వానిదేనని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారికి ఆస్పత్రిపై బాధ్యత పట్టదా? అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఈ సంఘటకు ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. వైద్యులు నిర్లక్ష్యంతో కాకుండా మానవత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు.