పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించే వరకూ పోరాటం
హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు
వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా
విజయవాడ (గాంధీనగర్) : పేదల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించే వరకూ ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాలను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తామని వాగ్దానం చేశారని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దుర్మార్గమని విమర్శించారు. పాయకాపురం, సింగ్‌నగర్ ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని కోరుతూ ప్రకాష్‌నగర్ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ధర్నాలో వంగవీటి రాధా ప్రసంగించారు. పాయకాపురం, సింగ్‌నగర్ ప్రాంతాల పేదలు రోజువారీ కూలిపనులు చేసుకుని జీవిస్తారని, పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే డబ్బు కోసం ఇళ్ల పట్టాలు తాకట్టుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. స్వరాజ్య మైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టినట్లే ఈ ప్రాంతాన్ని కూడా విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించకుంటే ప్రజలతో రోడ్డుపై బైఠాయిస్తామని హెచ్చరించారు.
మార్కుల కోసమే జగన్‌పై విమర్శలు
సీఎం చంద్రబాబు వద్ద మార్కులు పొందేం దుకే తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రులు విమర్శలు చేస్తున్నారని వంగవీటి రాధా ఎద్దేవాచేశారు. రోడ్లపై సమావేశాలు నిర్వహించవద్దని సుప్రీం కోర్టు ఆదేశించినా, నిత్యం వేల వాహనాలు, లక్షల మంది ప్రజలు రాకపోకలు సాగించే బెంజిసర్కిల్ వద్ద జాతీయ రహదారిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా సుప్రీం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. తాము రోడ్డు పక్కన ధర్నా చేస్తుంటేనే ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం జాతీయ రహదారులను బ్లాక్ చేసి దీక్షలు చేయడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేశారని నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైలా సోమినాయుడు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు బహదూర్, భవకుమార్, పల్లం రవికుమార్, అవుతు శ్రీశైలజ, సోడిశెట్టి సుజాత, బీజాన్‌బీ, పాల ఝాన్సీరాణి, శివశంకర్, జమాల పూర్ణిమ పార్టీ డివిజన్ అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ, పలువురు నాయకులను పోలీసులు అరెస్టుచేసి ఇతర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు తరలించారు.
తోట్లవల్లూరు పీఎస్‌కు తరలింపు
విజయవాడ ప్రకాష్‌నగర్‌లో ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ నాయకులు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, ఉమ్మడిశెట్టి బహదూర్, ఎస్‌కె.గౌస్‌మొహిద్దీన్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్ తోపాటు పలువురు మహిళలను స్కూల్ బస్సులో తోట్లవల్లూరు సీఎస్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటలకు వారిని విడిచి పెట్టారు.