
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణం
వైఎస్సార్ సీపీ నేతలు వంగవీటి రాధ, లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నేడు విజయవాడలో దీక్ష
విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రాధా కార్యాలయంలో పార్టీ కార్పొరేటర్లతో వారు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల ప్రజల ప్రయోజనాలను తన చర్యలతో తాకట్టుపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా సీఎం నోరు మెదపడంలేదని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏ ప్రభుత్వమైనా కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలంటే ఆయా నదీ బోర్డుల అనుమతి తప్పనిసరి అని వివరించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించడాన్ని సాకుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తానూ అనుమతులు లేకుండానే కృష్ణా, గోదావరి నదులపై అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని విమర్శించారు. వాటిని అడ్డుకోవాల్సిన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకే జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ సర్కారుపై పోరుకు దిగారని చెప్పారు. కర్నూలు జిల్లాలో చేపట్టిన జలదీక్షకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు జగన్‌మోహన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.
జగన్‌కు మద్దతుగా నేడు నగరంలో దీక్ష
కర్నూలులో జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షకు మద్దతుగా మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని అలంకార్ థియేటర్ వద్ద దీక్ష చేపడుతున్నామని వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. రైతులు, ప్రజలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా అంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ దీక్షకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు చేపట్టాలని సూచించారు. అనంతరం ధర్నా ఏర్పాట్లను పార్టీ కార్పొరేటర్లతో సమీక్షించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, చందన సురేష్, పళ్లెం రవి, కె.దామోదర్, కరీమున్నీసా, వీరమాచినేని లలిత, ఉమ్మడిశెట్టి బహుదూర్, పాలా ఝాన్సీలక్ష్మి, మల్లేశ్వరి, ఐతు శైలజ, చోడిశెట్టి సుజాత తదితరులు పాల్గొన్నారు.