విజయవాడ (గాంధీనగర్) : ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయకుండా, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బా కొడుతున్నారని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. ఏ హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చారో చెప్పాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్మూ ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఈ రెండేళ్లలో మీరేం చేశారు? మీ సొంతానికి ఎంత ఖర్చుచేశారు? ప్రజల కోసం ఎంత ఖర్చు చేశారు? కేంద్రం ఎంత ఇచ్చిందో స్పష్టంచేయాలి’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరుతూ గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. తొలుత వైఎ స్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ నాయకులు న్యూ ఇండియా హోటల్, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్ మీదుగా గవర్నర్‌పేట పీఎస్ వరకూ పాదయాత్ర చేశారు.
రుణాలు వట్టిమాటే..
ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసగించి అధికారం చేజిక్కించుకున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మోసంచేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కాలేదని, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఆపై మాటతప్పి కాపులపై కేసులు పెట్టి వేధిం పులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల రిజిస్ట్రేన్లు పునరుద్ధరించాలని ధర్నా చేస్తే అరెస్టు చేయించిన సీఎం చంద్రబాబు తాను మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నవనిర్మాణ దీక్ష పేరుతో బెంజిసర్కిల్ వద్ద బందరు రోడ్డుపై సభ నిర్వహించి, ప్రజలకు ఇబ్బంది కలిగించారని విమర్శించారు. రాష్ట్రంలో 2050 వరకు చంద్రబాబు పాలన ఉంటే ప్రజలంతా వలస వెళ్లాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన హామీలతో కూడిన ఫిర్యాదును సీఐకు అందజేశారు.
మహిళలు తలెత్తుకోలేకపోతున్నారు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో గౌరవంగా బతికిన మహిళలకు నేడు తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పైలా సోమినాయుడు, కామా దేవరాజ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, కార్పొరేటర్లు బొప్పన భవకుమార్, చందన సురేష్, దాసరి నాగమల్లేశ్వరి, బహుదూర్, షేక్ అసిఫ్, బుల్లా విజయ్‌కుమార్, శివశంకర్, దామోదర్, పూర్ణిమ, వీరమాచనేని లలిత, సంధ్యారాణి, బీజాన్‌బీ, చోడిశెట్టి సుజాత, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, ట్రేడ్‌యూనియన్ నాయకులు విశ్వనాథ రవి, బోను రాజేష్, అమ్ముల రవికుమార్, విద్యార్థి నాయకుడు అంజిరెడ్డి పాల్గొన్నారు.