ఫర్నిచర్‌తో అదిరేటి లుక్
అల్లిపురం : ఇంటిని చూసి ఇల్లాలను చూడాలన్నది నానుడి. ఇంటిని సర్ధడంలో మొట్టమొదటి ఇంటీరియన్ డిజైనర్ స్థానం ఆమెదే. ఎవరింటికైనా వెళ్లగానే ఎవరి చూపులైనా పడేది ఆ ఇంట్లో ఫర్నిచర్‌పైనే. అబ్బా ఎంత బాగుంది... ఎక్కడ చేయించారు అంటూ ముగ్దులైపోవడం పరిపాటి. గతంలో టేకు, రోజువుడ్ వంటి కర్రతో చేసిన వస్తువులకు గిరాకీ బాగా ఉండేది. కాలంతో పాటు ఫర్నిచర్‌లో కూడా డిస్పోజబుల్ వస్తుండడం విశేషం. అందుకు ఫైబర్, ఐరన్, పీవీసీ, ప్లైవుడ్, మీడియం డెన్సీటీ ఫైబర్ వంటి రడీమేడ్ ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చింది.
దీంతో ఫర్నిచర్ తయారు చేయడం చాలా సులభతరమైంది. ఆర్డర్ ఇవ్వడమే తరువాయి మనకు నచ్చిన డిజైన్లు, గ్లాస్ ఫినిషింగ్‌తో ఆద్భుతమైన ఫర్నిచర్ మన కళ్ళముందు ఆవిష్కతమవుతుంది.
మోడరన్ కిచెన్..
ఇల్లాలికి వంటిల్లే కార్యాలయం. ఆ కార్యాలయానికి ఆమె మహారాణి. అక్కడ ఆమెకు కావాల్సిన సౌకర్యాలు, వస్తువులు అందుబాటులో ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగిన విధంగా వంటింటిని అలంకరించుకోవడంలో మహిళలు పోటీ పడుతుంటారు. వంటిల్లు ఎంత విశాలంగా ఉంటే అంత బాగా అలంకరించుకోవడానికి వీలుకలుగుతుంది. వారి అభిరుచిలకు తగిన విధంగా మోడరన్ కిచెన్‌లు తయారు చేయడంలో కంపెనీలు ఇపుడు ఉత్సాహం చూపిస్తున్నాయి. కిచెన్ ప్లాట్‌ఫాంపై గ్యాస్ స్టవ్ మొదలుకొని వారికి కావాల్సిన ఓవెన్‌లు, మిక్సీ, జ్యూసర్, గ్రైండర్లు కావాల్సిన సమయంలో వాడుకొని తరువాత భద్రపరుచుకోనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బయటకు శుభ్రంగా కనిపిస్తుంది. కావాల్సిన వస్తువులు, పాత్రలు పెట్టుకునేందుకు ర్యాక్‌లతో అలరిస్తున్నాయి. తక్కువలో తక్కువ రూ.1.50 లక్షల నుండి రూ.3 లక్షలు వెచ్చించేందుకు Ðð నుకాడడం లేదు.
గదులకు తగ్గ ఫర్నిచర్..
లివింగ్ హాల్, డైనింగ్ హాల్, బెడ్‌రూంలలో ఒకప్పుడు ఫర్నిచర్ చేయించుకోవాలంటే నెలలు తరబడి చేయాల్సి వచ్చేది. అందుకు ఇంటి నిండా చెత్తా చెదారం, గమ్ములతో పనిచేస్తూ ఉండే వారు. కానీ వాటికి కాలం చెల్లింది. మనకు కావాల్సిన ఫర్నిచర్ సైజులు తీసుకుని ఆర్డన్ బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. నెల రోజుల్లో మనకు కావాల్సిన ఫర్నిచర్ మౌల్డ్ చేసి తీసుకువచ్చి రెండు రోజుల్లో మనం చూపించిన చోట ఫిక్స్ చేసి వెళ్లిపోతున్నారు. అప్పటి వరకు సాధారణంగా ఉన్న ఇళ్లు మోడరన్ ఫర్నిచర్‌తో కొత్త లుక్ సంతరించుకుంటుంది. కావాల్సిన రంగులు, డిజైన్లతో చూడగానే వావ్ అనిపించేలా చూడగానే కళ్లు చెదిరే డిజైన్లు మార్కెట్లో మురిపిస్తున్నాయి.