లేతచేతుల సాగు..పలు విధాల బాగు..
లేతచేతుల సాగు..పలు విధాల బాగు..
Published Sat, Mar 4 2017 11:00 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
పాఠశాలల్లో సత్ఫలితాలనిస్తున్న పెరటి సాగు
మధ్యాహ్నభోజనానికి సేంద్రియ పంటలు
ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు ఆర్థిక ఉపశమనం
విద్యార్థులకు సాగుపై పెరుగుతున్న అవగాహన
ఆవరణలో కంటికి ఇంపైన పచ్చదనం.. అన్నంలోకి పంటికి పసందైన స్వచ్ఛమైన కూరగాయలు.. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పెరటి సాగుతో పలు విధాలుగా మేలు జరుగుతోంది. సాగుపై విద్యార్థులకు అవగాహనతో పెరుగుతున్న ధరలతో కూరగాయలు కొనలేని దుస్థితి నుంచి మధ్యాహ్నభోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు ఉపశమనం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆటవిడుపు వంటివే ఆ ప్రయోజనాలు. 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా పెరటి (కిచెన్ గార్డెన్సు) కూరగాయల సాగు సత్ఫలితాలనివ్వడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత విస్త్రతంగా అమలు చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది.
– తుని రూరల్
జిల్లాలోని 64 మండలాల్లో ఉన్న 641 పాఠశాలల్లో పెరటిసాగును చేపట్టారు. ఖాళీ స్థలాలున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను ఎంపిక చేసి గతేడాది ఆగస్టులో పెరటి కూరగాయల సాగు చేపట్టారు. ప్రతి మండలంలో విద్యా, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో ఐదు నుంచి పది పాఠశాలల్లో సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యానశాఖ అధికారులు సమకూర్చిన వంగ, బెండ, దొండ, టమాటా, మునగ, మిరప వంటి కూరగాయలు, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర తదితర ఆకుకూరల విత్తనాలను పాఠశాలల ప్రాంగణంలో వేశారు. రెండు నెలల తర్వాత నుంచి పండిన కూరగాయలను, ఆకుకూరలను ఆయా పాఠశాలల్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వండే మధ్యాహ్న భోజనాలకు వినియోగిస్తున్నారు. వారంలో రెండు నుంచి మూడు రోజులు పెరటి కూరలు, ఆకు కూరలనే వండి వడ్డిస్తున్నారు.
కొంతమేరకైనా ఆరోగ్యకరమైన కూరగాయలు
మార్కెట్‌లో కొనే కూరగాయలు రసాయనిక ఎరువులతో పండించినవే. వీటి వినియోగం విద్యార్థుల మానసిక, శారీరక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు అనుగుణంగా పెరటి కూరగాయల సాగుపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు విద్యార్థులకు రసాయనిక ఎరువులతో పండించిన కూరలకు బదులు కొంతమేరకైనా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు లభిస్తున్నాయి.
భవిష్యత్ వ్యవసాయ నిపుణులకు నాంది
విద్యార్థులు చదువుల యంత్రా లుగా మారుతున్న వేళ పెరటి కూరగాయల సాగువల్ల వారిలో వ్యవసాయంపై అవగాహన కలుగుతుంది. తినే కూరలు ఏ విధంగా పండుతాయి, ఏవిధంగా పండించాలన్న అంశాలు తెలుస్తాయి. రైతులు ఎదుర్కొంటున్న కష
్టనష్టాలు స్వయంగా తెలుసుకోవడంతో కూరగాయలను వృథా చేయకూడదన్న స్పృహ పెరుగు తుంది. సాగుపై మక్కువ పెరిగి, వారిలో కొందరు భవిష్యత్‌లో వ్యవసాయ నిపుణులుగా ఎదగడానికి గట్టిపునాది అవుతుంది.
Advertisement