మాట మార్చిన వెంకయ్య
– టీ డీపీ మహిళా విభాగం నిరసన
మచిలీపట్నం టౌన్ :
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఈ హామిని నిలబెట్టుకోవాలని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గళమెత్తాలని టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత కోరారు. హోదా అంశంపై టీడీపీ జిల్లా మహిళా విభాగం బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బన్‌ను కట్టుకుని నిరసన తెలిపారు. సునీత మాట్లాడుతూ విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేహోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామని మోడీ నాడు హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 యేళ్లు చాలదని, 10 యేళ్లు కావాలని రాజ్యసభలో కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు మాట మార్చి మాట్లాడటం విచారకరమన్నారు. ఈ నిరసనలో టీడీపీ నాయకురాళ్లు అమ్మటిపూడి నాగలక్ష్మి, పాలపర్తి పద్మజ, సోమయాజుల హైమావతి, వేమూరి శ్రీదేవి, బడుగు ఉమాదేవి, ఘంటా విజయదుర్గ, వాలిశెట్టి హైమావతి, లంకిశెట్టి నీరజ పాల్గొన్నారు.