
ఎక్కడున్నా నెల్లూరు మీదే..
►కోమల విలాస్‌లో భోజనం, నెల్లూరు చేపల పులుసంటే మహాఇష్టం
►రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి దాకా..
►అంచెలంచెలుగా ఎదిగన వెంకయ్యనాయుడు
నెల్లూరు(బారకాసు): రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఎదిగిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరంటే ఎంతో ఇష్టపడుతారు. ఆయన ఎంతటి ఉన్నతస్థాయికి ఎదిగినా ఎక్కడున్నా నెలకోసారైనా నెల్లూరు రావాల్సిందే. ఒక్కోసారి మూడు నాలుగు నెలలు పట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు నెల్లూరు వెళ్తామా అని ఆలోచించేవారు. నెల్లూరు వచ్చిన ప్రతిసారీ ఆయనతో పాటు చదువుకున్న స్నేహితులు ఆమంచర్ల శంకరనారాయణ, దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, పేర్నేటి ఆదిశేషారెడ్డి తదితరులను కలవనిదే వెళ్లేవారు కాదు. వారితో ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలా సాధారణ విషయాలు మాత్రమే చర్చించేవారు.
నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని జేమ్స్‌గార్డెన్‌లో వెంకయ్యనాయుడు వివాహనంతరం దాదాపు ఐదేళ్లపాటు నివాసం ఉన్నారు. అలాగే నగరంలోని తనకిష్టమైన ప్రాంతం ట్రంక్‌రోడ్డు. ఇక్కడి ప్రాంతంలో నడుస్తూ చల్లనిగాలి పీల్చుకుంటూ ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటానని దీంతో తాను ఎంతో ఆరోగ్యకరంగా ఉండగలుగుతున్నానని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోకి వెంకయ్యనాయుడిని తీసుకొచ్చిన భోగా ది దుర్గాప్రసాద్, సోంపల్లి సోమయ్య పేర్లను ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.
చల్లా దోసెలు, పులిబొంగరాలంటే ఇష్టం
వెంకయ్యనాయుడు నెల్లూరు వచ్చినప్పుడు సాయంత్రంపూట తన స్నేహితుడైన చిన్నబజార్‌లోని మీనాక్షిజ్యూయలరీ అధినేత చింతాల సుందర్‌రాజన్ షాపువద్దకు వెళ్లేవారు. సమీపంలో ఓ చిన్న టిఫిన్ దుకాణం ఉండేది. అక్కడ వేసే చిన్న చిన్న దోసెలు (చల్లాదోసెలు), పులిబొంగరాలు అంటే అమితంగా ఇష్టపడేవారు. వాటిని అది పనిగా తెప్పించుకుని తినేవారు.
కోమల విలాస్ భోజనం, సీమా టీ..
నెల్లూరు వచ్చిన ప్రతిసారీ ట్రంక్‌రోడ్డులోని సీమా సెంటర్‌లో టీ తాగేవారు. కోమల విలాస్‌లో భోజనం ఎంతో ఇష్టంగా తినేవారు. నేటికీ నెల్లూరు వస్తే కోమల విలాస్ భోజనం, టిఫిన్ తప్పనిసరిగా చేస్తారు. కోమల విలాస్ అధినేత కోమల ప్రసాద్‌కు వెంకయ్యనాయుడుతో దాదాపు 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. అంతేకాకుండా నగరంలోని ట్రంకురోడ్డులో ఉండే జనసంఘ్ కార్యాలయానికి వచ్చి అక్కడే కొంత సమయం గడిపి అక్కడికి వచ్చే వారందరితో ముచ్చటించేవారు. అప్పట్లో జయభారత్ ఆసుపత్రి పక్కనే ఉన్న వెంకటేశ్వర థియేటర్‌కు అనుకుని ఉన్న ఖాళీస్థలంలో జనసంఘ్‌కు సంబంధించిన ముఖ్య స్నేహితులంతా వెంకయ్యనాయుడుతో కలసి కొంత సమయాన్ని గడిపేవారు.
వినాయక చవితి వేడుకల్లో..
ట్రంకురోడ్డులోని శివాజీ సెంటర్‌లో ఏటా న్విహించే వినాయక చవితి వేడుకల్లో వెంకయ్య తప్పకుండా హాజరయ్యేవారు. ఆ వేడుకల్లో అందరితో కలసి ఎంతో సంతోషంగా సంబరాన్ని జరుపుకునేవారు. దాదాపు 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొంటూ వస్తుండటం గమనార్హం. మూడేళ్ల నుంచే పార్టీ పరంగా బాధ్యతలు పెరగడంతో వెంకయ్యనాయుడు వినాయక చవితి వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని తెలిసింది.
మురికి నీళ్లు చూసే బాధపడేవారు..
వెంకయ్యనాయుడు నెల్లూరు వచ్చినప్పుడల్లా నగరంలో పారే మురికి నీళ్లు చూసి ఎంతో బాధపడేవారు. సరైన డ్రెయినేజ్ లేకపోవడంతో నగరంలో ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందేవారు. దీంతో ఆయన కేంద్రమంత్రి అయిన తరువాత నెల్లూరు నగరానికి భూగర్భ డ్రైనేజ్ వచ్చేందుకు తనవంతు కృషి చేసి ఆ పథకాన్ని సాధించారు.