వర్జీనియా రైతులకు న్యాయం చేస్తాం
వర్జీనియా రైతులకు న్యాయం చేస్తాం
Published Thu, Apr 27 2017 8:53 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేష్ అన్నారు. గురువారం స్థానికంగా రెండు పొగాకు వేలం కేంద్రాలను ఆయన పరిశీలించారు. వేలం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సరాసరి ధర కేజీకి రూ.155 ఇవ్వాలని రైతులు కోరారు. అలాగే విదేశీ ఆర్డర్లు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక ఈ ఏడాది దిగుబడి కొద్దిగా పెరిగిందని, అందువల్ల ఒక్కో బ్యారన్‌కు అదనంగా 4 క్వింటాళ్లు అమ్ముకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. కొనుగోళ్ల సమయంలో ఆయా పొగాకు కంపెనీలు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సంక్షేమ పథకానికి సంబంధించి కొన్ని నిబంధనల వల్ల రైతు కుటుంబాలకు న్యాయం జరగడం లేదని, దీనిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అలాగే బ్యారన్‌లకు బీమా చేయిస్తున్నామని, అయితే సకాలంలో నష్టపరిహారం అందడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాగా దీనిపై పరిశీలించి అన్ని చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. పొగాకు బోర్డు కార్యదర్శి సీఎస్‌ఎస్ పట్నాయక్, ఆక‌్షన్ మేనేజర్ కె.రవికుమార్, ప్రొడక‌్షన్ ఏఎస్ సీహెచ్‌వీ మారుతీప్రసాద్, రీజినల్ మేనేజర్ ఎం.శ్రీరామమూర్తి, అకౌంట్ అసిస్టెంట్ మేనేజర్ చింతమనేని ఏసుదాసు, వేలం అధికారులు కేవీ రాజప్రకాష్, ఆర్.రమేష్‌బాబు, బోర్డు మాజీ వైస్‌చైర్మన్ గద్దే శేషగిరిరావు, పొగాకు బోర్డు సభ్యుడు గడ్డమణుగు సత్యనారాయణ, రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
16.3 మిలియన్ కిలోల అమ్మకాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16.3 మిలియన్ కిలోలు పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయి. మొత్తం 130 మిలియన్ కిలోలు పంట పండించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సరాసరి ధర 148.21 లభించింది. కాగా ఎన్‌ఎల్‌ఎస్‌లో ఇప్పటివరకు 3.86 మిలియన్ కిలోలు అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని 5 వేలం కేంద్రాల్లో ఈ అమ్మకాలు పెరగ్గా, సరాసరి ధర 145.27 రూపాయలు లభించింది. ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలో 42 మిలియన్ కిలోలు పంట పండించేందుకు బోర్డు అనుమతించింది.
Advertisement
Advertisement