సికింద్రాబాద్ రైల్వేలో వింత దొంగలు
రాంగోపాల్‌పేట్: రైల్వే టికెట్ కన్ఫం చేయిస్తామంటూ ప్రయాణికుల లగేజీ, డబ్బులతో ఉడాయించే ఆరుగురి సభ్యుల ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.22వేల విలువ చేసే రియాల్‌ను, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురం పోలీస్‌స్టేషన్ లో ఏసీపీ గంగాధర్, ఇన్‌స్పెక్టర్ రాంచంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన హరి ఓం కుమార్ (28), ఉమేష్ ముకియా(25), మహ్మద్ ఫరూఖ్ (19), అనిల్ కుమార్ (19), పరంజిత్‌కుమార్ (19), బిక్రమ్ కుమార్ (14)లతో పాటు సంతోష్, అశోక్, వినోద్, వివేక్, సచిన్ ఆనంద్ ముఠాగా ఏర్పడ్డారు.
వీరు రైల్వే స్టేషన్‌లో తిష్టవేసి రిజర్వేషన్ చేసుకున్న టికెట్ బెర్తు కన్ఫం కాని ప్రయాణికులను టార్గెట్ చేసుకుంటారు. వారి వద్దకు వెళ్లి తమకు రైల్వేలో ఉన్నతాధికారులు తెలుసని వారితో టికెట్ కన్‌ఫాం చేయిస్తామని నమ్మిస్తారు. వారిని రైల్వే టికెట్ కార్యాలయానికి తీసుకెళుతూ ప్రయాణికుల లగేజీని తమ ముఠాలోని మరో సభ్యుడికి అప్పగించాలని సూచిస్తారు. అటు తర్వాత టికెట్ డబ్బు తీసుకుంటారు. కొద్ది దూరం వెళ్లాక మాటల్లో పెట్టి ఏదో సాకుతో ఇప్పుడే వస్తానని నమ్మించి మాయమవుతారు. దీనిపై పలువురు ప్రయాణికులు గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.