– గోపాలమిత్రల తొలగింపుపై పశుశాఖ జేడీ విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ–డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న గోపాలమిత్రల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గత జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తమ డిమాండ్ల సాధన కోసం గోపాలమిత్రలు నెలల తరబడి సమ్మెకు వెళ్లడం, విధులకు హాజరు కావాలని డీఎల్‌డీఏ అధికారులు గడువులు విధించడం, ఏకంగా డీఎల్‌డీఏ సీఈఓ డాక్టర్ కొండలరావు రంగంలోకి దిగడం, ఆయనతోనే సమ్మెలో ఉన్న గోపాలమిత్రలు గొడవ పడటం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సమ్మెలో ఉన్న గోపాలమిత్రలలో పలువురు విధుల్లో చేరారు. 60 మంది వరకు చేరకపోవడంతో సీఈఓ కొండలరావు ఆదేశాల మేరకు చైర్మన్ రాధాకృష్ణయ్య, జిల్లా ఈఓ తిరుపాలరెడ్డి విధుల నుంచి వారిని తొలగించారు.
ఆ తర్వాత వారి స్థానాలలో కొత్తగా 50 మంది గోపాలమిత్రల నియామకం చేపట్టారు. అందులో ఇప్పటివరకు 30 మంది వరకు విధుల్లో చేరినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమస్య ముగిసిపోయిందని భావించి ఊపీరిపీల్చుకున్న డీఎల్‌డీఏ అధికారులకు మళ్లీ కథ మొదటికి రావడం జరిగింది. డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తే తమను విధులను తొలగించారని పలువురు గోపాలమిత్రలు మంత్రులు, అధికార, విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ తదితరుల దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేయించినట్లు సమాచారం. అలాగే కోర్టుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అకారణంగా తమను తొలగించి, డబ్బులు తీసుకుని కొత్తవారిని నియమించారనే ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్, జేడీఏహెచ్, డీఎల్‌డీఏ ఈవో, చైర్మన్‌పై ఒత్తిళ్లు రావడంతో ఈ అంశంపై పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
తీర్మానం మేరకు తొలగింపు
తమపై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమని డీఎల్‌డీఏ చైర్మన్ రాధాక్రిష్ణయ్య, ఈఓ తిరుపాలరెడ్డి కొట్టిపారేశారు. అలా అయితే 50 మందిని నియమించగా ఇప్పటివరకు 30 మంది మాత్రమే విధుల్లో చేరారని చెబుతున్నారు.
డబ్బులకు అమ్ముకున్నారు
సరైన జీతం లేక ఉద్యోగ భద్రత కరువై ఇబ్బందులు పడుతున్న గోపాలమిత్రల డిమాండ్లు పరిష్కరించాలని అడిగినందున తమను తొలగించి కొత్త వారి నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారని గోపాలమిత్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వెంకటేష్ ఆరోపించారు. న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
విచారణ చేపట్టాం
ఈ అంశంపై కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పశుశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ తెలిపారు. కదిరి, అనంతపురం డివిజన్లలో గత రెండు రోజులుగా పలువురు తొలగించిన గోపాలమిత్రలను కలిసినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా కలెక్టర్‌కు నివేదిస్తానన్నారు.
మళ్లీ మొదటికి..
Published Sat, Dec 31 2016 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
Advertisement