న్యూఢిల్లీ/కోల్‌కతా: స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగానే ఆత్మనిర్భర్ భారత్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య గొప్పదనాన్ని గుర్తించిన వారి స్ఫూర్తితో మరింత శక్తివంతమైన, తెలివైన జాతిని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామ కాలంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శనంలో విశ్వభారతి యూనివర్సిటీ రూపుదిద్దుకుందని, ఆనాడే ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం పడిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ శతవసంతోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జ్ఞాన సముపార్జనకై విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు. విశ్వభారతి, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా ఇస్లామియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ వంటి ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతకాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యనభ్యసిస్తున్నారు. జాతిని మరింత శక్తివంతం చేసేందుకు మనం దానిని ఉపయోగించాల్సి ఉంటుంది. స్వాత్రంత్యం కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావులు జాతి కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు. వారి కారణంగానే నేడు మనం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు.(చదవండి: ‘వారిని దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’ )
ఇక తన స్వరాష్ట్రం గుజరాత్‌తో రవీంద్రనాథ్ ఠాగూర్‌కు అనుబంధం ఉందన్న ప్రధాని మోదీ.. ‘‘ గురుదేవ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతాను. తన పెద్దన్నయ్యకు గుజరాత్‌లో పోస్టింగ్ వచ్చిన కారణంగా ఆయనను చూసేందుకు అనేకసార్లు అక్కడికి వెళ్లారు. అంతేకాదు గుజరాతీలో ఆయన రెండు పద్యాలు కూడా రాశారు. భిన్న సంస్కృతులకు నెలవైన భారత్ గొప్పదనాన్ని, సుహృద్భావంతో కలిసి మెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే నేను ఈ ప్రస్తావన తీసుకువచ్చాను. భిన్న భాషలు, ఆహారపుటలవాట్లు, వేషధారణ కలిగి ఉన్నప్పటికీ అంతా ఐకమత్యంగా ఉండటమే మనకున్న అతిపెద్ద బలం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు నిదర్శనం’’ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఠాగూర్ వదినమ్మే ఆధునిక చీరకట్టుకు ఆద్యురాలు అని పేర్కొన్నారు. కాగా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఔట్‌సైడర్లు అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి ప్రస్తావించడం గమనార్హం. ఇక ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన బెంగాల్ మంత్రి బ్రత్యా బోస్.. ‘‘ప్రధాని మోదీ చెప్పినట్లుగా గుజరాత్‌లో పనిచేసింది ఠాగూర్ పెద్దన్నయ్య కాదు. అలాగే ఆయన భార్య పేరు జ్ఞానదనందిని. ఆమె చీరకట్టు గురించి ప్రచారంలో ఉన్నవన్నీ కల్పితాలు మాత్రమే. అదే విధంగా విశ్వభారతి యూనివర్సిటీని జాతీయత అంశంతో ముడిపెట్టారు. మతాన్ని అడ్డుపెట్టుకుని జాతీయత గురించి మాట్లాడమని ఠాగూర్ ఎప్పుడూ చెప్పలేదు’’ అని విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment