
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సందేశ్‌ఖాలీ వివాదంపై ప్రధాని తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘పదే పదే సందేశ్‌ఖాలీ ఆందోళనలపై మాట్లాడుతున్న ప్రధానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో మహిళలు, దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదు. ఆయన కుంభకర్ణుని తరహాలో నిద్ర పోతున్నారు. సందేశ్‌ఖాలీ ఆందోళనలపై మా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంది’అని మమత తెలిపారు. కాగా, టీఎంసీ నేత షేక్ షాజహాన్ సందేశ్‌ఖాలీలో తమపై లైంగిక దాడులు చేసి వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఆందోళన బాట పట్టారు.
ఈ ఆందోళనలకు కారణమైన షేక్ షాజహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖా పత్రకు బీజేపీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. మరోపక్క టీఎంసీ షేక్ షాజహాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బెంగాల్‌లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది.