నెగ్గిన అవిశ్వాసం
⇒ కందుకూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్‌పై గెలిచిన అధికార పార్టీ
⇒ తాత్కాలిక చైర్మన్‌గా మల్లేష్, వైస్ చైర్మన్‌గా బాల్‌రెడ్డి
⇒ 4వ తేదీన పూర్తి స్థాయిలో ఎన్నిక
⇒ అవిశ్వాసం అనంతరం డైరెక్టర్లు నేరుగా శిబిరానికి
కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్మన్ రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసాన్ని ఎట్టకేలకు అధికార పార్టీ నెగ్గించుకుంది. జూలై 11న అధికార పార్టీ డైరెక్టర్ సరికొండ మల్లేష్ 10 మంది సభ్యుల సంతకాలతో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. సొసైటీ అధికారులు ఆగస్టు 2న అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి తేదీని ప్రకటించారు. జరిగిన పరిణామాలతో జూలై 30న చైర్మన్ వెదిరె నర్సింగంరెడ్డి రాజీనామా పత్రాన్ని డీఎల్‌సీఓకు అందించారు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానానికి శిబిరం నుంచి నేరుగా పది మంది డైరెక్టర్లు సరికొండ మల్లేష్, హరికిషన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాములు, కొండారెడ్డి, యాదయ్య, జంగయ్య, బాల్‌రాజ్, లక్ష్మమ్మ, యాదమ్మతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వచ్చారు. డిప్యూటీ రిజిస్ట్రార్, డివిజన్ కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్‌రావు, సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి నర్సింహారెడ్డి ఉదయం 10.30 గంటలకు చైర్మన్ నర్సింగంరెడ్డి పంపిన రాజీనామ పత్రాన్ని ఆమోదించారు.
అనంతరం హాజరైన సభ్యుల సమక్షంలో వైస్ చైర్మన్ ఎల్లారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించారు. 10 మంది డైరెక్టర్ల ఏకగ్రీవ ఆమోదంతో వైస్ చైర్మన్ పదవీచ్యుతుడు అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం తాత్కాలిక చైర్మన్‌గా మీర్‌ఖాన్‌పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్, వైస్ చైర్మన్‌గా నేదునూరు డైరెక్టర్ సర్గారి బాల్‌రెడ్డిని సభ్యులందరి ఏకాభిప్రాయంతో నియమించినట్లు ప్రకటించారు. పూర్తి స్థాయి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఈనెల 4న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తామని డీఎల్‌సీఓ శ్రీనివాస్‌రావు ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. ఆరోజు కోరం కింద 7 మంది డైరెక్టర్లు హాజరైతే పరిగణలోకి తీసుకుంటామని, చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటామని చెప్పారు. సొసైటీ పదవీ కాలం ఫిబ్రవరి 2018 వరకు ఉంటుందన్నారు. ఒకసారి ఎన్నికైతే మళ్లీ మూడేళ్ల వరకు అవిశ్వాసానికి అవకాశం లేదన్నారు.
పోలీసుల బందోబస్తు..
ఉదయం నుంచి సొసైటీ కార్యాలయంలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ఆదిబట్ల, మంచాల, మహేశ్వరం సీఐలు గోవిందరెడ్డి, గంగారం, మన్మోహన్, స్థానిక ఎస్‌ఐలు చెన్నకేశ్వర్, సుధాకర్, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే, అవిశ్వాస సమావేశం పూర్తయిన తర్వాత డైరెక్టర్లను నేరుగా ఎమ్మెల్యే తీగల మినీ బస్సులో శిబిరానికి తరలించారు.