
విశాఖలో విజయసాయిరెడ్డి
నేడు కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు
జీవీఎంసీ ఎన్నికలకుపార్టీ శ్రేణుల సన్నాహాలు
విశాఖపట్నం : రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి గురువారం నగరానికి వచ్చారు. సీతమ్మధారలోని రాకెట్ టెన్నిస్ పార్కు ఎదురుగా ఉన్న కార్యాలయంలో కార్యకర్తలకు ఎంపీ అందుబాటులో ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. శుక్రవారం కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరిస్తారని అమర్‌నాథ్ వివరించారు.
ఎన్నికల సన్నాçహకం : విశాఖ–భీమిలి మధ్య ఐదు పంచాయతీలు విలీనమయ్యేందుకు అంగీకరించడంతో జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియకు తొలి అడుగు పడినట్టయ్యింది. దీంతో ఏ క్షణాన్నయినా ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం వెలువరించే అవకాశం ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్లుగా సిద్ధమవుతోంది. దానిలో భాగంగా విజయసాయిరెడ్డి నగరంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. తరచుగా నగరంలో పర్యటిస్తూ సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు ఎన్నికల్లో గెలుపు కోసం వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో మేయర్ పీఠం దక్కించుకుంటామనే గట్టి నమ్మకం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తోంది. శుక్రవారం కూడా ఎంపీ విజయసాయిరెడ్డి కార్యకర్తలతో జీవీఎంసీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నారు.