రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
Published Fri, Aug 5 2016 10:02 PM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
బుట్టాయగూడెం : మండలంలోని రెండు రేషన్ షాపులపై ఏలూరుకు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. రెండు షాపుల్లో సరుకుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి ఆ షాపులపై 6(ఏ) కేసులు నమోదు చేశారు. బుట్టాయగూడెం గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తున్న షాపు నంబర్ 7లో తొలుత అధికారులు తనిఖీలు చేశారు. అందులో 170 లీటర్ల కిరోసిన్, రెండు క్వింటాళ్ల బియ్యం, 38 కేజీల పంచదార ఉండాల్సి ఉండగా, అంతకంటే అదనంగా ఉన్నట్టు గుర్తించారు.
వీటివిలువ రూ.8వేల ఐదు వందల 14 ఉంటుందని విజిలెన్స్ అధికారిణి, తహసీల్ధార్ వి.శైలజ తెలిపారు. ఈ సరుకులను సీజ్ చేసి పౌరసరఫరాల ఆర్‌ఐకు అప్పగించినట్టు చెప్పారు. అలాగే మండలంలోని విప్పలపాడు రేషన్‌షాపులోనూ తనిఖీలు జరిగాయి. ఇక్కడ 425 లీటర్ల కిరోసిన్, తొమ్మిదిన్నర కేజీల పంచదార ఎక్కువగా ఉందని, 35 కేజీల బియ్యం తక్కువగా ఉందని గుర్తించారు. ఈ షాపుపైనా కేసు నమోదు చేసినట్టు శైలజ వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై కరిమికొండ సీతారామ్ ,ఏజీ జి.జయప్రసాద్, ఏవో బి.శ్రీనివాసకుమార్, కానిస్టేబుల్ కె.నాగరాజు, ఆర్‌ఐ రమేష్‌లు పాల్గొన్నారు.
ఈ–పోస్‌తో అక్రమాలకు అడ్డుకట్ట పడిందా!
ఈ–పోస్ విధానం అమల్లోకి వచ్చాక రేషన్‌షాపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని ప్రభుత్వం చేస్తున్న వాదనలో పసలేదని తేలిపోయింది. తాజా తనిఖీల్లో బయటపడిన అవకతవకలే దీనికి నిదర్శనం. అధికారులు కేవలం రెండు షాపులనే తనిఖీ చేయగా, ఆ రెంటిలోనూ అవకతవకలు బయటపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తే ఎన్ని అక్రమాలు వెలుగు చూస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్థానికులు చెబుతున్నారు.
Advertisement
Advertisement