సమాజపు దృశ్య కావ్యాలు..‘నంది’ నాటకాలు
సమాజపు దృశ్య కావ్యాలు..‘నంది’ నాటకాలు
Published Fri, Jan 20 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
కర్నూలు(కల్చరల్) : ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న అనేకానేక దురాచారాలు, దురాగతాలు, వాటిపై తిరుగుబాట్లు, పరిష్కారాలు, గుణపాఠాలు... వీటన్నింటికీ దృశ్య కావ్యాలుగా నంది నాటకాలు నిలిచాయి. కుటుంబం, సమాజంలో దిగజారిపోతున్న విలువలు... పతనమవుతున్న మానవతా దృక్పథం... అత్యున్నత విలువల వైపు పయనించవలసిన ఆవశ్యకత... తెలియజేస్తూ నంది నాటకాల ప్రదర్శన జరిగింది. నంది నాటకోత్సవాల్లో భాగంగా మూడో రోజున స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ఐదు నాటికలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు జస్ట్ స్మైల్ తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘మానవ బ్రహ్మ’ సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి కుటుంబం పుత్రుడు కావాలనే ఆరాటపడటం, ఆ పుత్రుడు తమ ఆశయాలకు అనుగుణంగా ఎదగకపోతే ఆవేదన చెందడం, ఇదీ నడుస్తున్న చరిత్ర. మానవ బ్రహ్మ నాటిక ఈ నడుస్తున్న చరిత్రకు దర్పణం పడుతూ ప్రతి తండ్రీ ఒక బ్రహ్మలాంటివాడని, పుత్రులను ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు తండ్రులు బ్రహ్మలా వ్యవహరించాల్సిన అవసరముందని ఈ నాటిక తెలియజేసింది. ఈ నాటకాన్ని పల్లేటి లక్ష్మీకులశేఖర్ రచించగా డాక్టర్ జె.రవీంద్ర దర్శకత్వం వహించారు.
భారతీయ సంస్కృతి ఔన్నత్యం చాటిన కృష్ణబిలం...
కళాంజలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన కృష్ణబిలం నాటిక భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని చాటిచెప్పింది. కృష్ణబిలం అంటే బయటినుంచి వచ్చే ఏ పదార్థాన్నైనా రెట్టింపు వేగంతో విసిరివేయడం, అంతర్గత పదార్థానికి రక్షణ ఇవ్వడం. సరిగ్గా భారతీయ సంస్కృతిలో ఈ లక్షణాలే నిబిడీకృతమై ఉన్నాయని ఈ నాటిక చాటిచెప్పింది. విదేశీ సంస్కృతిలో మానవ సంబంధాలు పలుచగా ఉంటూ తల్లిదండ్రులు, బిడ్డలకు మధ్య ప్రేమాభిమానాల స్థానంలో అగాథాలు ఏర్పడతాయి. కానీ భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఒక విడదీయరాని అనుబంధం ఉంటుంది కానీ అపారమైన ఎడబాటు ఉండదు. ఈ విలువలను కాపాడు కోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పిన ఈ నాటికకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఆకురాతి భాస్కరచంద్ర రచించారు.
సనాతన విలువలకు ప్రతీకగా ‘నాయకురాలు నాగమ్మ’...
సత్కళాభారతి హైదరబాద్ నాటక సమాజం ప్రదర్శించిన ‘నాయకురాలు నాగమ్మ’ నాటిక పురుషాధిక్యతను ఎదుర్కొన్న తీరుతెన్నులను ప్రదర్శించింది. కరీంనగర్ జిల్లా ఆర్వేలి గ్రామంలో పుట్టిపెరిగిన ఒక స్త్రీమూర్తి యదార్థగాథకు నాటకీయ రూపమే ఈ నాటిక. నాయకురాలు నాగమ్మ అపారమైన మేధస్సుతో పురుషులకు దీటుగా నడిపిన రాజకీయ మంత్రాంగం ఇప్పటికీ ఆదర్శప్రాయం. నాగమ్మ కథను కళ్లకు కట్టినట్లుగా చిత్రించిన ఈ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్.ఎస్.నారాయణబాబు రచించిన ఈ నాటకానికి డాక్టర్ కోట్ల హనుమంతరావు దర్శకత్వం వహించారు.
కనువిప్పు కల్గించిన నాటిక ‘చట్టానికి కళ్లున్నాయి’...
రసరంజని మేకా ఆర్ట్స్ హైదరబాద్ నాటిక సమాజం ప్రదర్శించిన ‘చట్టానికి కళ్లున్నాయి’ నాటిక కనువిప్పు కల్గించే దృశ్యాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వెంగళరెడ్డి అనే ఫ్యాక‌్షనిస్టు జైలులో ఉన్నా తన అనుచరులతో తన దుర్మార్గాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తుండగా ఒక కార్యాలయంలోని ఉద్యోగి తిరుగుబాటు చేసి చట్టానికి కళ్లున్నాయని నిరూపించిన ఇతివృత్తమే ఈ నాటిక. ఫ్యాక‌్షనిస్టులు అధికారులను లోబరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక ఉద్యోగి దానిని తుదముట్టించేందుకు సిద్ధమవుతాడని ఈ నాటిక చాటిచెప్పింది. ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు.
చక్కని సందేశాత్మక నాటిక ‘ఖాళీలు పూరించండి’...
కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వైజాగ్ నాటక సమాజం ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ప్రస్తుత సమాజంలో పౌరులు నేరస్తుల గురించి సమాచారం పోలీసులకు చేరవేయకుండా తమకు తామే శిక్ష విధించుకుంటున్నారని తెలియజేసింది. మోహన్, విశ్వం, మాయ, బాబా పాత్రల మధ్య జరిగిన సన్నివేశాలు అత్యంత ఉత్కంఠతను కల్గించాయి. నేరస్తులను పోలీసులకు పట్టించడం, శిక్ష పడేటట్లు చేయడం పౌరులు అలవర్చుకోవాలనే సందేశాన్ని ఈ నాటిక అందించింది. ఉదయ్ భాగవతుల ఈ నాటిక రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
Advertisement
Advertisement