కొండపాకలో మాట్లాడుతున్న చిట్టి దేవేందర్‌రెడ్డి
- డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి
కొండపాక: వెలికట్ట ఎంపీటీసీ ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర్గుల మల్లవ్వను గెలిపించి విశిష్టమైన తీర్పుచెప్పారని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. కొండపాక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడగానే ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెలికట్ట ఎంపీటీసీ స్థానానికి తాను ఊహించిన విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారన్నారు.
ఇదివరకు ఎంపీటీసీగా గెలుపొంది మృతి చెందిన బూర్గుల యాదంరావుపై ఉన్న నమ్మకంతో ఆయన భార్య మల్లవ్వ ను ఏకగ్రీవంగా గెలిపించాలనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారన్నారు. అయితే టీడీపీ నేతలు అందుకు సహకరించలేదన్నారు. కొందరు టీడీపీ నాయకులు ఇంకా సీమాంధ్ర పార్టీ నేతల కనుసన్నల్లోనే పని చేస్తున్నారన్నారు. తెలంగాణా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకునే వారికి ఇదేగతి పడుతుందన్నారు.
తెలంగాణా ఏర్పడక ముందు టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు మరిచి పోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులకు సహకరించాలని లేకుంటే నోరు మూసుకు కూర్చోవాలని నియోజక వర్గ టీడీపీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డిని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతుల పద్మ, జెడ్పీటీసీ మాధురి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షులు , సర్పంచులు యాదగిరి, కనుకారెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.