రైళ్ల కోసం ఎదురుచూపులు
డోర్నకల్ : విజయవాడ రైల్వేస్టేన్‌లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో నాలుగు రోజులుగా విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం కొత్తగూడెం – మణుగూరు మార్గంలో వర్షాలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో మణుగూరు – కాజీపేట ప్యాసింజర్ రద్దయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోర్నకల్ రైల్వేస్టేన్‌లో ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రయాణికులు తిప్పలుపడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ సుమారు నాలుగు గంటల ప్రాంతంలో డోర్నకల్ మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లింది. ఈ రైలు వస్తున్న సమాచారం తెలియకపోవడంతో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. విజయవాడలో ఆర్‌ఆర్‌ఐ ఆధునీకరణ పనులు పూర్తి కావొచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.