కన్నీళ్లు..
⇒ పొంచి ఉన్న నీటిగండం
⇒ పట్టణాలను వేధిస్తున్న సమస్య
⇒ వేసవి ఆరంభంలోనే అదరగొడుతున్న వైనం
⇒ అడుగంటిన జలం.. ఎండిపోతున్న బోర్లు..
⇒ ప్రొద్దుటూరులో కొన్నిచోట్ల వారానికి ఓమారు సరఫరా
నింగినుంచి నేలకు చినుకుల సందేశం వర్షం.. వంగి నీడ చూసుకున్నా అలలు కదులుతాయేమో అన్నంత ప్రశాంతంగా నదీతీరం.. పతనంలో కూడా ఎనలేని చైతన్యం ఉందని దీటుగా చెప్పే జలపాతం. దిగంతాల నుంచి ముంచెత్తేలా పరుగులెత్తుకొచ్చి పాదాలకు గిలిగింతలు పెట్టి జారుకునే సాగరం.. మనకు ప్రకృతి అయాచితంగా ప్రసాదించిన ఈ వరాలన్నింటిలోనూ ఉమ్మడి సొగసుకు పేరొక్కటే నీరు... నీరు లేని ఒక్కరోజును కూడా ఊహించలేం..భూమ్మీద ప్రాణులన్నింటికీ జీవామృతం నీరు.. ప్రస్తుతం ఇది కరువైపోతోంది. బొట్టుబొట్టునూ బంగారం కన్నా అపురూపంగా వాడుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే బంగారం ఇచ్చి నీరు కొనుక్కోవాల్సి వస్తుందేమోననే భయం వెంటాడుతోంది. జిల్లాలోని పలుప్రాంతాల్లో మంచినీటి కోసం అవస్థలు మొదలయ్యాయి. వేసవి మొదలు కాకుండానే దాహం కేకలు వినిపిస్తున్నాయి.
సాక్షి, కడప :
‘‘ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,65,000 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఐదేళ్లు కలుపుకుంటే ప్రస్తుతం జనాభా రెండు లక్షలు పైమాటే. అయితే ఒక్కొక్క మనిషికి సగటున రోజుకు 130 లీటర్ల నీటిని అందించాలి. కానీ ప్రస్తుతం రెండు రోజులుకు సగటున మనిషికి కేవలం మూడు లీటర్ల లోపు మాత్రమే అందిస్తున్నారు. రోజుకు ఇవ్వాల్సినవి మూడు రోజులకు సరఫరా చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జనానికి సంబం«ధించి 14 ఎంఎల్‌డీల నీటిని అందించాల్సి ఉండగా, కేవలం తొమ్మిది ఎంఎల్‌డీలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని వార్డుల్లో వారానికి ఒకసారి నీటిని అందిస్తున్నారంటే ప్రొద్దుటూరులో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది.’’
జిల్లాలో రోజురోజుకు తాగునీటి సమస్య జటిలమవుతోంది. ఈరోజు పనిచేస్తున్న బోరు మరుసటిరోజుకు పనిచేయకుండా పోతుండడంతో ఇంజనీర్లతోపాటు అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఎండ ప్రభావం పెరిగేకొద్ది భూమిలో నీటి జాడలు ఆవిరవుతున్నాయి. దీంతో పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రధానంగా జిల్లాలోని మున్సిపాలిటీలను పరిశీలిస్తే ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం....తాగడానికి గుక్కెడు నీరు లేని పరిస్థితి దాపురించింది.
స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నాళ్లవుతున్నా కనీస అవసరాల్లో ఒకటైన తాగునీటిని పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా సగటు జీవికి నీరందించడంలో మాత్రం పాలకులతోపాటు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందని తెలిసినా వచ్చినపుడు చూద్దాంలే అని అధికారులు సాగతీత ధోరణిలో వెళుతుండడం కూడా పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రొద్దుటూరులో వారానికి ఓ మారు సరఫరా
జిల్లా కేంద్రమైన కడప నగరానికి సమానంగా రూపుదిద్దుకున్న ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలు తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపు 40 వార్డులు ఉండగా, అన్నిచోట్ల దాదాపు తాగునీటికి ఇక్కట్లు నెలకొన్నాయి. సమస్య పరిష్కరించండి....ప్రజలు అవస్థలు పడుతున్నారని గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పోరాటం చేస్తున్నారు. ప్రజల సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష కూడా చేపట్టారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని సంజీవనగర్, స్వరాజ్యనగర్, వాజ్‌పేయినగర్, గోకుల్‌నగర్, హనుమాన్‌నగర్, ఎర్రన్నకొట్టాల, మోడంపల్లె హరిజనవాడ, ఆవాజ్ నగర్ తదితర ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీరిస్తుండడంతో వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. నీరొచ్చే ప్రాంతాలకు వెళ్లి బైకుల్లో తెచ్చుకోవడం, మరికొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లి కొళాయిల వద్ద తెచ్చుకోవడం, ఇంకొందరు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులు ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదు. మిగతా చోట్ల కూడా మూడు, నాలుగు రోజులకు నీరిస్తున్నారు.
అంతటా విపత్కర పరిస్థితులే!
జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. ప్రధానంగా పట్టణాల్లో గొంతెండుతోంది. మైదుకూరులో 5, 10, 11, 14, 21, 22 వార్డుల్లో, అలాగే పులివెందులలో కూడా పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి పూర్తి స్థాయిలో నీరు రాకపోతే సమస్య ఎదుర్కొవాల్సిందే! మైదుకూరులో కొన్నిచోట్ల బోర్లు ఎండిపోవడంతో ప్రజలు వ్యవసాయ బోరు బావులు వద్ద నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. బద్వేలులో కూడా 7, 19, 24తోపాటు మరికొన్ని వార్డుల్లో సమస్య నెలకొంది. ప్రస్తుతం రూ. 110 కోట్లతో చేపట్టిన పంపింగ్ స్కీమ్ పనులు పూర్తయిన నేపథ్యంలో ట్రయల్ రన్ చేస్తున్నారు. ఇది పూర్తిగా నీటిని అందించగలిగితే బద్వేలు మున్సిపాలిటీకి సమస్య తప్పే అవకాశం ఉంది. రాజంపేటలో కూడా అక్కడక్కడ నీటి సమస్య ఎదురవుతోంది.
ట్యాంకర్లే ఆధారం
జిల్లాలోని కడప నగరంలో కూడా నీటికి ఇక్కట్లు మొదలవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్ది సమస్య పెరగనుంది. ప్రధానంగా శివారు ప్రాంతాలైన మామిళ్లపల్లె, ఊటుకూరు, తిలక్‌నగర్, నానాపల్లె, గండి, సాగర్ కాలనీ, సరోజినీనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో సమస్య కనిపిస్తోంది. జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, బద్వేలు, కడప తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా చెరువులు, నదుల్లో బోర్లు వేసి పూర్తి స్థాయిలో పంపింగ్ స్కీమ్ ద్వారా వాటర్ తీసుకునిరావాలి. లేకపోతే సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంది.