నీటి మూటలే..!
Published Sat, Feb 4 2017 11:58 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- నీటి విడుదల ప్రకటనకే పరిమితం
- కేసీకి నీరు బంద్ చేసిన ఇంజినీర్లు
- ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు
కర్నూలు సిటీ:
శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. ఒక పంటకే కాదు రెండు, మూడు, నాలుగు పంటలకైనా సాగు నీరు ఇస్తాం.
- ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు
గోదావరి నుంచి డెల్టాకు ఎంత నీరు తరలించామో.. అంతే మొత్తంలో కేసీకి కృష్ణా జలాలు ఇస్తాం.
- నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాని టీడీపీ నేతలు పోటీపడి ప్రకటనలు చేశారు. దీంతో రైతులు..కాల్వల కింద రబీలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. పంటలు కీలక దశకు వచ్చేసరికి సాగునీరు బంద్ చేశారు. నీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదు. ముఖ్యంగా కేసీ కెనాల్ కింద పంటలు సాగు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయకట్టు రైతులతో కలిసి వారం రోజులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఫలితం లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని అధికారులు..నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీ ఆయకట్టు రైతులు ఆందోళన బాట పట్టేందుకు.. గ్రామగ్రామాన దండోరా వేయిస్తున్నారు. వేలాది మంది రైతులు ఒక్కటై.. కలెక్టరేట్ ఎదుట, జల మండలి ఎదుట, చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు.
28 వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలు..
కేసీ కాలువ కింద రబీ సీజన్‌లో 0 నుంచి 120 కి.మీ వరకు 28 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ పంటలకు నీరు అందించేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వ అనుమతులు లేవని ఇంజినీర్లు చెబుతున్నారు. పంటలకు నీరు ఇస్తామని తాము చెప్పలేదని, మాటిచ్చిన ప్రజాప్రతినిధుల దగ్గరకే వెళ్లండనిని ఇంజినీర్లు సూచిస్తున్నారు. దీంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కొరవడిన ముందు చూపు..
హంద్రీనీవా మొదటి పంపు నుంచి రెండు పైపుల ద్వారా కేసీకి నీళ్లు మళ్లించేందుకు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. మల్యాల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసినా..ప్రయోజం లేకుండా పోయింది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేయడం లేదు. అలాగే ఎంతో అర్భాటంగా ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీరు బంద్ చేశారు. కేసీకి ముచ్చుమర్రి, మాల్యాల దగ్గర నుంచి నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఈ రెండు చోట్ల నీటిని వినియోగించుకోవాలంటే చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది. అయితే ఇవేమి పట్టించుకోకుండానే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులకు తాళాలు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement