ఎస్కేయూకు ఎక్కిళ్లు
- వర్సిటీలో తీవ్ర నీటిఎద్దడి
- రోజుకు 10 లక్షల లీటర్లు అవసరం
- సరఫరా అవుతోంది 2 లక్షల లీటర్లే
-ల్యాబ్‌లు, చెట్లు, ఇతరత్రా వాటికి నీరు బంద్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గతంలో ఎన్నడూలేని విధంగా సమస్య ఉధృతరూపం దాల్చింది. ఎలా గట్టెక్కాలోనని వర్సిటీ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. వర్సిటీకి రోజూ పది లక్షల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం రెండు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. ప్రధాన వనరులుగా ఉన్న పండమేరు వంకలోని మూడు బోరుబావులు అడుగంటిపోయాయి. సత్యసాయి పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు ఇచ్చేవారు. వేసవి కారణంగా ఈ పథకానికి నీటి లభ్యత తగ్గిపోయింది. దీంతో వర్సిటీకి సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం మహిళా వసతిగృహంలో ఉండే మూడు బోరుబావులు, చిత్రావతి హాస్టల్ వద్ద ఉండే ఒక బోరుబావి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదింట ఒక వంతు మాత్రమే అందుతుండటంతో పరిస్థితి దయనీయంగా మారింది.
ట్యాంకర్లతో సరఫరా
నీటి ఎద్దడిని కొద్దిమేరకైనా గట్టెక్కే ఉద్దేశంతో వారం నుంచి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. అత్యవసర విభాగాలు తప్ప తక్కిన వాటికి బంద్ చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులందరూ హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశోధక విద్యార్థులకు సైతం ఈ ఆదేశాలివ్వడం గమనార్హం. ఉద్యోగ నివాస సముదాయాలకు రెండు, మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు.
పడకేసిన పరిశోధన
వర్సిటీ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పెరగాలంటే సైన్స్ విభాగాల్లో పరిశోధనలే గీటురాయి. అయితే..ల్యాబ్స్‌కు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైంది. వర్సిటీ ప్రాంగణంలోని చెట్లకు నీటి సరఫరా పూర్తిగా బంద్ చేయడంతో అవి ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడిని శాశ్వతంగా అధిగమించడానికి పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ప్రత్యేక పైపులైన్ వేయాలని ఎస్కేయూ యాజమాన్యం పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించింది. ప్రస్తుతం పీఏబీఆర్ నీరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు వస్తోంది. అక్కడి నుంచి వర్సిటీకి సమీపంలోని పూలకుంట గ్రామం వరకు నీరు సరఫరా చేయడానికి కొత్తగా పైప్‌లైన్ వేస్తున్నారు. దాన్ని కాస్త వర్సిటీ వరకు పొడిగిస్తే సమస్య శాశ్వతంగా తీరుతుంది. ఇటీవల నిర్వహించిన ‘నీరు – ప్రగతి’ కార్యక్రమంలో వర్సిటీలో నీటి ఎద్దడి గురించి వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.రాజగోపాల్ నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి హామీ లభించలేదు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
వర్సిటీ బోరుబావుల్లో ఆశించినంత నీరు లభించడంలేదు. పండమేరు వంకలో ఉన్న బోరుబావులు అడుగంటిపోయాయి. దీంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం.
–వి.మధుసూదన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ , ఎస్కేయూ