జీడీపీ కింద ఆరుతడి పంటలకే నీరిస్తాం
Published Thu, Nov 3 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
కర్నూలు సిటీ: గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని, ఇతర పంటలకు సాగు నీరు ఇవ్వలేమని జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ చంద్రశేఖర్‌రావు సూచించారు. గురువారం స్థానిక జల మండలి కార్యాలయంలో గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఏఏ పంటలు సాగు చేసుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న నీరు తదితర అంశాలపై జీడీపీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవేంద్ర, డిప్యూటీ చైర్మన్ మల్లికార్జున, జేడీఏ ఉమా మహేశ్వరమ్మలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ జీడీపీలో ఉన్న నీటి నిల్వలను బట్టి చూస్తే ప్రస్తుతం సాగులో ఉన్న ఆయకట్టుకు, తాగునీటికి అయితే ఇబ్బందులు ఉండకపోవచ్చన్నారు. అయితే హంద్రీనీవా నీరు పందికొన నుంచి హంద్రీనది ద్వారా జీడీపీలోకి వస్తే ఆరుతడి పంటలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారికంగా ఏఏ పంటలకు నీరు ఇస్తారో నేడు ప్రకటిస్తామన్నారు. సమావేశంలో జీడీపీ మాజీ చైర్మన్ ప్రకాష్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement