మమ్మల్ని చంపి కంపెనీ కట్టుకోండి | we killed them | Sakshi
Sakshi News home page

మమ్మల్ని చంపి కంపెనీ కట్టుకోండి

Published Fri, Aug 5 2016 10:58 AM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

మమ్మల్ని చంపి కంపెనీ కట్టుకోండి - Sakshi

మమ్మల్ని చంపి కంపెనీ కట్టుకోండి

పిఠాపురం :
‘పచ్చని పల్లె ప్రాంతాల్లో మందులు కంపెనీలు పెట్టి ప్రాణాంతకమైన విషవాయువులతో మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా? దానికి ముందే మమ్మల్ని చంపేసి మీరు కంపెనీలు కట్టుకోండి’ అంటూ దివీస్‌ భూసేకరణపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులవృత్తులు, కూలిపని తప్ప ఏపనీ రాని తమను ఎక్కడకు తరిమేద్దామని కుతంత్రాలు పన్నుతున్నారంటూ తొండంగి మండల తీర ప్రాంత వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. దివీస్‌ ల్యాబొరేటరీస్‌ కంపెనీ ఏర్పాటుకు నిర్దేశించిన తొండంగి మండలం తీరప్రాంత గ్రామాలైన పంపాదిపేట, శృంగవృక్షంపేట, కొత్తపాకలు, ఒంటిమామిడి, తాటాకులపాలెం, నర్శిపేట, దానవాయిపేట, ఓడముసలయ్యపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది ప్రజలు గురువారం భూసేకరణకు వ్యతిరేకంగా తాటాకులపాలెంలో భారీ సమావేశం నిర్వహించారు.

ప్రాణాలను పణంగా పెట్టైనా భూములను కాపాడుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పిల్లాపాపలతో సహా జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈసమావేశంలో స్థానిక పెద్దలు ఎ. అరుణ్‌కుమార్, గంపల దండు, కడారి బుజ్జిబాబు, మేరుగు ఆనందహరి, మట్ల ముసలయ్య తదితరులు మాట్లాడుతూ మందుల కంపెనీ ఏర్పాౖటెతే గాలి, నీరు, వాతావరణం కలుషితమై ఎవరూ బతకలేరని, చివరకు సముద్రంలో చేపలు కూడా దొరకవని అన్నారు. ఈ సమావేశం రైతుల ఆత్మక్షోభ అని, దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలు పట్టించుకోపోతే మారణహోమానికి నాంది అవుతుందన్నారు. స్థానిక మంత్రి  కల్పించుకుని వెంటనే ఈ భూసేకరణను నిలుపుదల చేయించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

భూసేకరణ పేరుతో ఎవరు వచ్చినా గ్రామాల్లో తిరగనివ్వరాదని, భూసేకరణ నిలిపేసినట్టు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. పోలీసులు వచ్చి అక్రమ కేసులు పెట్టినా, ఎవరు బెదిరించినా ఉద్యమాన్ని ఆపకూడదని నిర్ణయించుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతు దేవుడిగా (శ్రీకృష్ణుడిగా ) పూజించుకున్న స్థానిక నేత ఇప్పుడు శత్రువుగా మారి తమని నాశనం చేయాలని చూస్తున్నాడని, దానికి తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. మత్స్యకారులు, గీత కార్మికులు, ఇతర కులాలకు చెందిన అందరూ జీవనోపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రోగాలను వ్యాపింపజేసే కంపెనీలను ఇక్కడకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నేతల మాయ మాటలను నమ్మి కొందరు తమ విలువైన భూములను అప్పగించడం మానుకోవాలని హితవు పలికారు. సుమారు 13 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement