
వరంగల్ ఎన్‌కౌంటర్ బాధాకరం: కవిత
హన్మకొండ: 'వరంగల్ జిల్లాలో ఎన్‌కౌంటర్ సంఘటన బాధాకరం. తోటి ఉద్యమకారిణి.. ఉద్యమాలలో ఒక పంథాలో వెళ్లిన బిడ్డ మృతి చెందడం దురదుష్టకరం. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తా' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఎన్‌ఎస్‌డీసీ సహకారంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, తెలంగాణ జాగృతి జిల్లా కార్యాలయాన్ని ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం హన్మకొండలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మహాసభలో ప్రసగించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ విమర్శించడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహుల పార్టీగా ఉన్న టీడీపీ, రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ దొంగల పార్టీగా మారిందన్నారు. పట్టపగలు ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిన దొంగలు, నైతిక విలులు లేని వారికి ఆ పార్టీ అధినేత పదవులు కట్టబెట్టారని తూర్పారబట్టారు. ఎర్ర జెండా పార్టీలు ఇంకా తోక పార్టీలుగానే ముందుకు పోతున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలు తిరిగినంత మాత్రానా ఆశ కార్యకర్తలు, రైతుల సమస్యలు పరిష్కారం కావన్నారు. సంవత్సర కాలంలో నరేంద్ర మోదీ ఏంచేశారు.. సీఎం కేసీఆర్ ఏం చేశారో.. బీజేపీ నాయకులు ఆలోచిస్తే కనిపిస్తుందన్నారు. రైతులపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మొదటగా వరంగల్‌లో ఏర్పాటు చేశామన్నారు. 2020 కల్లా 2 లక్షల మందికి నైపుణ్యాలు, మెళకువలపై 20 రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. కరెంటోళ్ళ సమస్యలు చూస్తే ఆంధ్రోళ్ళపాలన ఎంత అధ్వానంగా జరిగిందో అర్థమవుతుందని విమర్శించారు. విద్యుత్ కార్మికుల సమస్యలపై జెన్‌కో సీఎండీతో మాట్లాడానని విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సహనానికి పరీక్ష పెట్టొద్దని చెప్పానన్నారు. వారంలో 1170 మంది కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మన్‌ల సమస్య పరిష్కారమవుతుందన్నారు. అనంతరం మిగతా ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.