![‘మత’ శక్తులకు చోటివ్వం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81445459102_625x300.jpg.webp?itok=16B84_S1)
‘మత’ శక్తులకు చోటివ్వం
- పోలీసు అమరవీరుల దినోత్సవంలో సీఎం కేసీఆర్
- రాష్ట్రంలో సంఘవిద్రోహ శక్తులకు తావివ్వం
- పోలీసు అమరులకు సమాజం రుణపడి ఉంది
- గతేడాది పోలీసులకు ఇచ్చిన హామీల విస్మరణ నిజమే.. వాటిని త్వరలో నెరవేరుస్తాం
- డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 10 శాతం పోలీసు సిబ్బందికి రిజర్వు
- ఎస్సై, ఆ పైస్థాయి అధికారులకు ఇళ్ల స్థలాలు
- ‘ట్రాఫిక్’ పోలీసులకు అదనంగా 30 శాతం అలవెన్స్ ఇస్తామని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మతతత్వ శక్తులు, తీవ్రవాదులకు, సంఘ విద్రోహశక్తులకు, వైట్‌కాలర్ నేరగాళ్లకు చోటివ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నానని... ఏ దేశమైనా, రాష్ట్రమైనా శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్‌శర్మ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ‘‘దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణపడి ఉంది.
శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న త్యాగాలను సమాజంలోని అన్ని వర్గాలు గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించాలి. సమాజం నుంచి పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందాలంటే వారు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా, ప్రభుత్వ గౌరవ మర్యాదలను పెంచేలా విధులు నిర్వహించాలి. నూతన రాష్ట్ర అభివృద్ధికి కృషిచేయాలి. అరాచక శక్తులను అంతమొందించాలి..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
వరాల జల్లు..: ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి సీఎం కేసీఆర్ కొన్ని వరాలు ప్రకటించారు. గతేడాది స్వయంగా తాను ప్రకటించిన హామీలు కూడా విస్మరణకు గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఆ హామీలపై డీజీపీతో ఇటీవలే సమీక్షించానని, అవి త్వరలో అమలయ్యేలా చూస్తామని చెప్పారు. పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లస్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, హోంగార్డులు, మాజీ సైనికోద్యోగులకు కలిపి పదిశాతం ఇళ్లను ఏటా రిజర్వు చేస్తామన్నారు. ఎస్సై, ఆపైస్థాయి అధికారులకు వారు పనిచేస్తున్న జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇళ్లస్థలాలు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి స్థలం కేటాయిస్తామన్నారు.
పోలీసులకు యూనిఫాం కోసం ఇచ్చే వార్షిక అలవెన్స్‌ను రూ. 3,500 నుంచి రూ. 7,500కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. గంటల తరబడి కాలుష్యంలో నిలబడి విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్స్ అందజేస్తామని చెప్పారు. పోలీసుల వృత్తి చాలా శ్రమతో కూడుకున్నదని, వారి సేవలు వెలకట్టలేనివని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. దేశవ్యాప్తంగా 437 మంది పోలీసులు విధి నిర్వహణలో వీరమరణం పొందారని... వారిలో తెలంగాణకు చెందినవారు నలుగురు ఉన్నారని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అంశంపై నిర్వహించిన ఫొటో, షార్ట్‌ఫిలిం పోటీల్లో విజేతలకు సీఎం కేసీఆర్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీలు, ఐజీలు పాల్గొన్నారు.
ఇలా వచ్చి.. అలా వెళ్లిన గవర్నర్!
పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్... కొద్దిసేపు ఉండి, కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఉదయం 9కి హాజరవగా... గవర్నర్ ఉదయం 7గంటలకే వచ్చి నివాళి అర్పించారు. గౌరవ వందనం స్వీకరించి, అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించి వెళ్లిపోయారు.