‘అఖిల్’ విషయంలో తప్పు జరిగింది
ఏలూరు (సెంట్రల్) : ‘అఖిల్’ సినిమా విషయంలో అభిమానులు, సినిమా కుటుంబ సభ్యులు క్షమించాలని, మరోసారి అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. శనివారం సాయంత్రం ఏలూరులో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కథ కొత్తగా ఉందని అఖిల్‌తో ఆ సినిమా తీసినట్టు చెప్పారు. హీరోగా అఖిల్ ఎంతో ప్రతిభ చూపినప్పటికీ సినిమా ఆశించిన ఫలితం రాలేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తప్ప అందరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారని మొదటిసారిగా తాను తప్పు చేసినట్టు అనిపించిదన్నారు.త్వరలో మంచి హిట్‌తో అభిమానుల ముందుకు వస్తానని వినాయక్ తెలిపారు.
సినీ ప్రతినిధుల రుణం తీర్చుకుంటా
సినిమా విడుదల తరువాత సినీ ప్రతినిధుల వల్ల చిత్రం టాక్ తెలుస్తుందని, సినిమా కుటుంబంలో వారి సేవలు ఎంతో గొప్పవని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. స్థానిక విజయవిహార్ సెంటర్‌లోని ఓ హోటల్‌లో శనివారం సాయంత్రం సినీ రిప్రజెంట్స్‌కు వినాయక్ ఎల్‌ఐసీ బాండ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్న రిప్రజెంట్స్‌కు చివరికి ఎటువంటి ఆధారం లేకుండా పోతుందన్నారు. సన్నిహితుడు సీతారామ్ అనే వ్యక్తి రిప్రజెంట్లకు ఉచితంగా ఎల్‌ఐసీ పాలసీ చేయించాలని చెప్పడంతో కొందరు సహాయంతో చేయించినట్టు చెప్పారు. 53 మంది రిప్రజెంట్లకు బాండ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఉషా బాలకృష్ణ, అంబికా కృష్ణ, ఎల్‌వీఆర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.