బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (వర్కింగ్ టైటిల్) ఆదివారం ఆరంభమైంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ కొట్టారు.
దర్శకులు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించి, శుభాకాంక్షలు తెలిపారు. నటులు ప్రభాస్, రానా, కల్యాణ్ రామ్, దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్, వెంకీ అట్లూరి, నిర్మాతలు బి.వి.ఎస్.యన్. ప్రసాద్, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, కె.ఎల్. నారాయణ, ఎన్.వి. ప్రసాద్, సాయి కొర్రపాటి, పీవీపీ, శోభు యార్లగడ్డ, నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, యలమంచలి రవిశంకర్, వంశీ, విక్రమ్, పరుచూరి ప్రసాద్, రచయిత గుణ్ణం గంగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా సత్తాను ‘బాహుబలి’తో ప్రపంచానికి చాటి చెప్పిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా మా బ్యానర్‌లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఓ కలలా అనిపిస్తోంది. ప్రేక్షకులతో పాటు, హీరోల అభిమానుల అంచాలను మించేలా సినిమా ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువలతో కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీగా రూపొందిస్తాం.
రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న ప్రారంభిస్తాం. రెండు వారాలపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం. సినిమాలో భాగమైన ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...ఈ సినిమాకు ‘రామరావణ రాజ్యం’ అనే టైటిల్‌ని చిత్రబృందం పరిశీలిస్తోందన్న ప్రచారం ఫిల్మ్ నగర్‌లో సాగుతోంది. ఈ సినిమాకు కథ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రాహకుడు: కె.కె. సెంథిల్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment