శనివారం రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ... ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. రాజమౌళి మీద వాళ్లకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయో ఈ వీడియోలో సరదాగా పంచుకున్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘జనవరిలో పల్లవి చేస్తాం. జూన్‌లో చరణం. డిసెంబర్‌లో లిరిక్స్ రాస్తాం. వచ్చే ఏడాది మార్చిలో రికార్డింగ్ అంటాడు. అప్పటికి అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో? ఆ పాట ఎందుకు వస్తుందో? అనేది కూడా మర్చిపోతాం. అసలు ఆసక్తే పోతుంది’’ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘మనం రిలాక్స్ అయిపోదాం అనుకున్నప్పుడే కష్టమైన షాట్స్ అన్నీ షూట్ చేస్తుంటాడు రాజమౌళి. అది అనుకుని చేస్తాడో లేక అప్పుడే అలాంటి ఐడియాలు వస్తాయో తెలియదు. పన్నెండున్నరకి మొదలుపెడితే రెండున్నరకు అవుతుంది. అప్పటికి ఆకలిపోతుంది. ఆ మధ్య నైట్ షూట్ చేశాం. రాత్రి 2 గంటలకు ప్యాకప్ చెప్పాలి. మా రాక్షసుడికి ఒకటిన్నరకి కొత్త ఆలోచన వస్తుంది. ఒక్క షాట్ కోసం 4 వరకూ ప్రయత్నిస్తాడు. పర్ఫెక్షన్ కోసం మా అందర్నీ చావకొడుతుంటాడు’’ అన్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘రేపు యాక్షన్ సీన్ ఉందని జిమ్ బాగా చేసి చాలా ఉత్సాహంతో సెట్‌కి వెళ్తాను. 40 అడుగుల నుంచి ఇలా దూకాలి, చేయాలి అని అద్భుతంగా వివరిస్తారు. సూపర్ అనుకుంటాను. కాస్త రిస్కీగా ఉంది.. ఎవరు సార్ ఇది చేసేది? అని అడుగుతా అమాయకంగా. నువ్వే అంటారాయన. వెంటనే లాప్‌ట్యాప్ తెప్పించి మూడు రోజుల ముందే ఆ యాక్షన్ సీన్ ఆయన చేసింది చూపిస్తారు. ఆయన చేశాక మనం చేయకపోతే ఏం బావుంటుంది? ఎలాగోలా చేస్తాం’’ అన్నారు. మా అందరి సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మమ్మల్ని అందర్నీ పని చేసేలా చేసే రాజమౌళిగారికి జన్మదిన శుభాకాంక్షలు అని చిత్రబృందం తెలిపింది. ఈ వీడియోలో దర్శకత్వ శాఖ, కెమెరామేన్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, నిర్మాత దానయ్య కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment