మీ మాటేమిటి !
Published Wed, Mar 1 2017 10:10 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
- విద్యత్ చార్జీ పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ
– చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
– నేడు విద్యుత్ భవన్‌లో విన్నపాల స్వీకరణ
– చార్జీలు పెంచితే జిల్లాపై ఏటా రూ. 224కోట్ల అదనపు భారం
కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2017–18 సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. జనవరి 18న విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నివేదికలు సిద్ధం చేసి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కమిషన్ (ఏపీ ఈఆర్‌సీ)కి సమర్పించాయి. వీటికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈఆర్‌సీ అభిప్రాయ సేకరణకు పూనుకుంది. ఇందులో భాగంగా గురువారం కర్నూలు నగరంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ, విన్నపాల స్వీకరణ చేపట్టనుంది.
బాదుడు భారం రూ.224కోట్లు :
డిస్కంలు ఈఆర్‌సీకి సమర్పించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 3,359కోట్ల ఆదాయాన్ని అర్జించేందుకు సిద్ధపడగా అందులో కర్నూలు జిల్లా ప్రజలపై రూ.224కోట్ల మేరకు భారం పడనుందని అంచనా. ఇందులో కేవలం గృహ వినియోగదారులపైనే రూ.78.11కోట్లకు పైగా భారం పడే అవకాశముంది. ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి.
– ముచ్చటగా మూడోసారి:
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే మొదటిసారిగా రూ.100కోట్లు భారం మోపింది. 2016లో రెండోసారి రూ.28.37కోట్లు బాదింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారిగా భారీ ఎత్తున చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈఆర్‌సీ ఆమోదం అనంతరం ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది ఆచరణలోకి వస్తుంది. కొత్త చార్జీల టారీఫ్ కేవలం ఒక్క ఏడాదికి మాత్రమే. కరువు కాటకాలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల వంటి సమస్యలతో అల్లాడుతుండగా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– నేడు విద్యుత్ భవన్‌లో అభిప్రాయ సేకరణ:
కర్నూలు నగరంలోని విద్యుత్ భవన్ రెండవ అంతస్తులో ఉన్న సమావేశపు హాలులో విద్యుత్ చార్జీలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ భవాని ప్రసాద్, సభ్యులు రఘు, రామ్మోహన్, ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు దొర, టెక్నికల్, ఫైనాన్స్ డైరెర్టర్లు పి. పుల్లారెడ్డి, సయ్యద్ బిలాల్ బాషా, ట్రాన్స్‌కో అధికారులు హాజరు కానున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరక కార్యక్రమం కొనసాగనుంది.
Advertisement
Advertisement