కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఇంటికేనా...?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి చదువుతోపాటు కళలు, వ్యాయామం, కంప్యూటర్ విద్య కూడా అందించాలనే సదుద్దేశంతో 2012–13 విద్యాసంవత్సరంలో కాంట్రాక్టు ప్రాతిపదికన అర్హత ఉన్న వారిని ఉపాధ్యాయులుగా నియమించింది.
-
కానరాని పునరుద్ధరణ
-
ఆందోళనలో ఉపాధ్యాయులు
మంచిర్యాల సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి చదువుతోపాటు కళలు, వ్యాయామం, కంప్యూటర్ విద్య కూడా అందించాలనే సదుద్దేశంతో 2012–13 విద్యాసంవత్సరంలో కాంట్రాక్టు ప్రాతిపదికన అర్హత ఉన్న వారిని ఉపాధ్యాయులుగా నియమించింది. జిల్లాలో ఇలా నియామకమైన వారు సుమారు 250 మంది ఉన్నారు. 2016–17 విద్యాసంవత్సరం ఆరంభమై నెలరోజులు కావస్తున్నా నేటికీ వీరి పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. దీంతో వారంతా ఆందోళనకు గురై ఇంటికే పరిమితం కావాల్సిందేనా అంటూ ఆవేదన చెందుతున్నారు. 2012–13 నుంచి నాలుగేళ్లపాటు కంప్యూటర్ ఆపరేటర్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, పీఈటీ ఉపాధ్యాయులుగా రూ.6 వేల వేతనంతో పనిచేశారు. పాఠశాలల ప్రారంభం రోజున విధులకు వెళ్లగా సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు విధులకు రావొద్దని, మీ పునరుద్ధరణపై ఎలాంటి ఆదేశాలు విద్యాశాఖ నుంచి రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ నుంచి నేటి వరకు కూడా జిల్లా విద్యాశాఖకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో నాలుగేళ్లపాటు సేవలందించిన వీరంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉన్న వారంతా కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సంతోషపడ్డారు. నేటì కీ ఉత్తర్వులు రాకపోవడంతో అసంతప్తిలో ఉండిపోయారు. ప్రజాప్రతినిధులను కలుస్తూ తమను ఆదుకోవాలంటూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఏటా పాఠశాలల ప్రారంభానికి ఒక రోజు ముందుగానే రెన్యువల్‌కు సంబంధించిన ఉత్తర్వులు రావడం ఆనవాయితీ.
కొత్తగా నియామకం..
ప్రభుత్వ పాఠశాలల్లో నియామక ప్రకటన జారీ చేసి కొత్తగా నియమించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు పనిచేసిన వారంతా కూడా నియామక ప్రకటన ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రకటన ఇవ్వడం నుంచి మొదలుకొని నియామకం అయ్యే వరకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల కాలం పట్టే అవకాశాలు ఉంటాయి. తద్వార ఉన్న పుణ్యకాలం కాస్త దగ్గర పడుతుంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.