పరీక్షలెప్పుడో? | When is the exams? | Sakshi
Sakshi News home page

పరీక్షలెప్పుడో?

Published Thu, Mar 30 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

పరీక్షలెప్పుడో?

పరీక్షలెప్పుడో?

జిల్లాలో బీఈడీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రథమ సంవత్సరం ముగిసి రెండో సంవత్సరంలో అడుగు పెట్టినా నేటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో  విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పరీక్షల తేదీని నేటికీ ప్రకటించకపోవడంపై విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధికారులపై విద్యార్థులు మండిపడుతున్నారు.

నెల్లూరు (టౌన్‌): జిల్లాలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేటు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సుమారు రెండు వేల మందికి పైగా బీఈడీ కోర్సు చదువుతున్నారు. 2015–16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్లు కోర్సుగా ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 1, 2 సెమిస్టర్లు, రెండో సంవత్సరానికి సంబంధించి 3, 4 సెమిస్టర్లు పరీక్షలు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులకు తొలి సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో జరగాల్సి ఉంది.

రెండో సెమిస్టర్‌ పరీక్షలను ఏప్రిల్‌ నెలలో నిర్వహిస్తారు. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు 1వ సెమిస్టర్‌ పరీక్ష ఇంత వరకు జరగలేదు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 3వ సెమిస్టర్‌ డిసెంబర్‌లో నిర్వహించారు, 4వ సెమిస్టర్‌ ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. వారికి టీచింగ్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరపకపోవడంతో బీఈడీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సెమిస్టర్‌ పరీక్షలు వెంట, వెంటనే జరిపితే ఏ విధంగా రాయాలని ప్రశ్నిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు
బీఈడీ పరీక్షలను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఈ పరీక్షలపై వీఎస్‌యూ అధికారులు ఎలాంటి దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీల పరిధిలోని బీఈడీ కళాశాలల్లో షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. జిల్లాలో వీఎస్‌యూ అధికారులు ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ముండిపడుతున్నారు.  ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అకడమిక్‌ పూర్తియినా నేటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ విషయంలో బీఈడీ కళాశాలల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించిందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పరీక్షలు నిర్వహించాలని బీఈడీ కళాశాల విద్యార్థులు కోరుతున్నారు.

ఆలస్యమైన మాట వాస్తవమే
బీఈడీ పరీక్షలు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కొత్తగా బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. దీంతో ఆలస్యమైంది. ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదటి, 3వ సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహిస్తాం.
 – చంద్రయ్య, ఇన్‌చార్జి రిజిస్ట్రార్, వీఎస్‌యూ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement