
విలపిస్తున్న మృతుని తల్లి శారద
‘రెగ్యులర్ ఉద్యోగం ఇప్పించేస్తాం. కొద్ది రోజులు ఆగండి. అంతవరకు మాతో పనిచేస్తాడు అంటూ ఏళ్ల తరబడి తిప్పుకుని ఇప్పుడు నా కుమారుడి మృతికి కారణమయ్యారు..
♦ పంచనామా నివేదిక సిద్ధమైతే బాధ్యులపై వేటు
♦ ఏఈని కేసు నుంచి తప్పించేందుకు యత్నాలు
♦ విద్యుత్ శాఖను కుదిపేస్తున్న ప్రైవేటు కార్మికుడి మృతి ఘటన
అరసవల్లి: ‘రెగ్యులర్ ఉద్యోగం ఇప్పించేస్తాం. కొద్ది రోజులు ఆగండి. అంతవరకు మాతో పనిచేస్తాడు అంటూ ఏళ్ల తరబడి తిప్పుకుని ఇప్పుడు నా కుమారుడి మృతికి కారణమయ్యారు’ అంటూ ప్రైవేటు కార్మికుడు ఎం.లక్ష్మీ సాయి ప్రసాద్ తల్లిదండ్రులు వీరాస్వామి, శారద గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. దీనంతటికీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గొల్లుమంటున్నారు. ఆదివారం ఫాజుల్‌బాగ్ పేటలో ప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగానే!
శనివారం సాయంత్రం స్థానిక గుజరాతిపేట సమీపంలో రెల్లివీధి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కిందకు పడిపోయి లక్ష్మీప్రసాద్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటన ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. నిబం«ధనల ప్రకారం ప్రైవేటు కార్మికులను విద్యుత్ స్తంభాలు ఎక్కించకూడదు. సంబంధిత ప్రాంత అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) శ్రీనివాస్, లైన్‌మేన్ ధనుంజయ్ తదితరులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసాద్‌ను విద్యుత్ స్తంభాలు ఎక్కించి పనులు చేయించుకున్నారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కీలకంగా పోస్టుమార్టం నివేదిక
ఈ కేసు రాజీ చేసేలా కొందరు విద్యుత్ ఉద్యోగులు రంగంలోకి దిగి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై మృతుని కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోస్టు మార్టమ్ రిపోర్టు కీలకంగా మారింది. ఆదివారం పోస్టుమార్టమ్ పూర్తయి.. అంత్యక్రియలు జరిగిపోయాయి. మరో రెండు రోజుల్లో రిపోర్టు రానుండడంతో ఇటు విద్యుత్ అధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. రిపోర్టులో విద్యుత్ షాక్‌తోనే మృతుడు మరణించినట్లు స్పష్టమైతే సంబంధిత బాధ్యులైన అధికార సిబ్బందిపై చర్యలు తప్పవని కొందరు అధికారులే చెబుతున్నారు.
ఏఈ శ్రీనివాస్‌ను తప్పించేందుకు యత్నాలు!
ఈ ఘటనలో విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు జోక్యం చేసుకోవడం చర్చనీ యాంశమైంది. ఇందులో ముఖ్యంగా శనివారం వన్‌టౌన్‌లో నమోదైన కేసులో ఏఈ శ్రీనివాస్ పేరును ప్రస్తావించడంతో.. కొందరు ఉద్యోగ సంఘ నేతలు ఎలాగైనా ఆ పేరును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు కొందరు ఉద్యోగులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. మృతుని తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించేందుకు ఓ వామపక్ష నేతను కూడా బరిలోకి దింపి ఆదివారం పంచాయితీ జరిపించారు. అయినప్పటికీ మృతుని సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం ఎటువంటి అంగీకారాన్ని వ్యక్తం చేయలేదని సమాచారం. ఒకవేళ ఏఈ శ్రీనివాస్‌ను దూరం చేస్తే పరిహార చెల్లింపులో బాధిత కుటుంబానికి తీవ్ర నష్టం జరుగుతుందని మృతుని సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.